అట్రాక్ట్ చేస్తున్న నాసా ఎలక్ట్రిక్‌‌ విమానం

అట్రాక్ట్ చేస్తున్న నాసా ఎలక్ట్రిక్‌‌ విమానం

ఎలక్ట్రిక్‌‌ సైకిళ్లు, బైక్‌‌లు, కార్లు ఇప్పటికే వచ్చేశాయి. ఇక తర్వాత ఎలక్ట్రిక్‌‌ విమానాలు. వీటిపైనా ఇప్పటికే కొన్ని కంపెనీలు ట్రయల్స్‌‌ చేశాయి. నడిపి చూపించాయి. కొన్ని అందుబాటులోకీ తీసుకొచ్చాయి. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా ఇలాంటి కరెంటు విమానాలపై కాలిఫోర్నియా ఎడారిలో ఉన్న తన ఏరోనాటిక్స్‌‌ బేస్‌‌లో 2015 నుంచి ప్రయోగాలు చేస్తోంది. తాజాగా శుక్రవారం తన విమానానికి సంబంధించి నమూనా విడుదల చేసింది. ఇంకా డెవలప్‌‌మెంట్‌‌ దశలోనే ఉన్నా ఇంజనీర్లు, పైలట్లు అనుభూతి పొందేలా పూర్తిగా నమూనా డిజైన్‌‌ చేసి రిలీజ్‌‌ చేసింది. మామూలు విమానాలతో పోలిస్తే ఎలక్ట్రిక్‌‌ మోటార్‌‌ ఇంజన్లు తక్కువ శబ్దం చేస్తాయని, తక్కువ బరువుంటాయని, మెయింటెనెన్స్‌‌ చాలా ఈజీ అని, ఎగిరేందుకు కూడా తక్కువ ఎనర్జీనే తీసుకుంటాయని ప్రాజెక్టు మేనేజర్‌‌ బ్రెంట్‌‌ కోబ్‌‌లెయిగ్‌‌ చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్‌‌ విమానాల్లా కాకుండా ‘ఎక్స్‌‌ 57’ను తక్కువ కరెంటు వాడుకునేలా, తక్కువ సౌండ్‌‌ విడుదల చేసేలా, మరింత్ర భద్రతంగా ఉండేలా డిజైన్‌‌ చేస్తున్నారు.

తొలి క్రూ ఎక్స్‌‌ ప్లేన్‌‌

నాసా ఎలక్ట్రిక్‌‌ విమానం పేరు ఎక్స్‌‌ 57 ‘మాక్స్‌‌వెల్‌‌’. ఇంచుమించు ఇటలీకి చెందిన రెండు ఇంజన్ల ‘టెక్‌‌నామ్‌‌ పీ2006టీ’ ప్రొపెల్లర్‌‌ ప్లేన్‌‌ మోడల్‌‌లోనే ఉంటుంది. కానీ 14 ఎలక్ట్రిక్‌‌ మోటార్లతో వస్తోంది. స్పెషల్‌‌గా చేసిన లిథియం అయాన్‌‌ బ్యాటరీలు వాడుతున్నారు. ఇలాంటి కేటగిరీలో ఇంతకుముందు బుల్లెట్‌‌ ఆకారంలోని బెల్‌‌ ఎక్స్‌‌1, నీల్‌‌ ఆర్మ్‌‌ స్ట్రాంగ్‌‌ ప్రయాణించిన ‘ఎక్స్‌‌ 15 రాకెట్‌‌’ను తీసుకొచ్చారు. కానీ ఎక్స్‌‌ 57 వీటన్నింటికన్నా ప్రత్యేకమని నాసా చెబుతోంది. ఇది అందుబాటులోకి వస్తే గత 20 ఏళ్లలో ఏజెన్సీ తీసుకొచ్చిన తొలి క్రూ ఎక్స్‌‌ ప్లేన్‌‌ ఇదే అవుతుంది. ఎలక్ట్రిక్‌‌ ఎయిర్‌‌క్రాఫ్ట్‌‌కు ఫస్ట్‌‌ చాలెంజ్‌‌ బ్యాటరీ. ఎక్కువ కరెంటు స్టోర్‌‌ చేసుకునే బ్యాటరీ ఉంటే విమానం ఎక్కువ దూరం పోతుంది. కానీ ప్రస్తుతమున్న బ్యాటరీలు తక్కువ కరెంటు స్టోర్‌‌ చేసుకునే సామర్థ్యం గలవి. అందుకే ఫస్ట్‌‌ రెడీ చేసే మాక్స్‌‌వెల్‌‌ ప్లేన్‌‌లను ఎయిర్‌‌ ట్యాక్సీలుగా, తక్కువ దూరాలకు వాడేలా డిజైన్‌‌ చేయబోతున్నారు. విమానం తేలికగా ఉండేలా తక్కువ బరువుండే రెక్కలను డిజైన్‌‌ చేస్తున్నారు. దీని టెస్ట్‌‌ ఫ్లైట్‌‌కు ఇంకా ఏడాది టైముంది. 2020 చివరి నాటికల్లా ప్లేన్‌‌ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు.