త్వరలో ఎలక్ట్రిక్ విమానాలు: నాసా

త్వరలో ఎలక్ట్రిక్ విమానాలు: నాసా

విదేశాలకు వెళ్లాలంటే విమాన ప్రయాణం తప్పని సరి. దీనికి ఖర్చు కూడా ఎక్కువే. మరోవైపు విమానాల నిర్వహణ విమానయాన సంస్థలకు భారం కూడా ఎక్కువే అవుతోంది. విమానాలకు వాడే వైట్‌ పెట్రోల్‌ చాలా ఖరీదు. ఈ ఖర్చును తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఇంధనంతో విమానాలు నడిపే టెక్నాలజీ కోసం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ గత కొంత కాలంగా చేస్తున్న ప్రయోగాలు ఫలించాయి. నాసా రూపొందించిన ఎలెక్ట్రిక్ విమానం త్వరలో గాల్లోకి ఎగరనుంది.

ఇప్పటికే ఈ విమానాన్ని తమ ఏరోనాటిక్‌ ప్రయోగశాలలో పరీక్షించామని, రిజల్ట్ అనుకూలంగా వచ్చిందని తెలిపింది నాసా. మరికొన్ని నెలల్లో ఎడ్వర్డ్‌ ఎయిర్ ఫోర్స్ బేస్‌ నుంచి ఈ ఎలెక్ట్రిక్ విమానం గాల్లోకి ఎగురుతుందని చెప్పింది. 14 మోటార్లతో నడిచే ఈ విమానానికి మాక్స్‌వెల్‌ ‘X-57’ అని పేరు పెట్టింది. 2015లో ఈ విమానాన తయారీ మొదలైంది. దీన్ని ఇటలీకి చెందిన టెక్నాం-P2006టీ విమానం ఆధారంగా తయారు చేస్తున్నారు.

నాసా తన ఇరవై ఏళ్ల చరిత్రలో రూపొందించిన విమానాల్లో ఇది మొదటిదని తెలిపారు ప్రాజెక్టు మేనేజర్‌ బ్రెంట్‌ కోబ్‌లీ. కేవలం నాసాకే కాకుండా మొత్తం విమాన పరిశ్రమే ఇలాంటి విమానాలు తయారు చేసేలా సాంకేతిక పరిజ్ఞానం రూపొందుతోందన్నారు.