డీప్ స్పేస్ నుంచి పంపిన నాసా స్పేస్ క్రాఫ్ట్ ‘సైకి’
న్యూయార్క్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ‘సైకి’ స్పేస్ క్రాఫ్ట్.. డీప్ స్పేస్లో 22.53 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్ పంపింది. ఈ విషయాన్ని నాసా వెల్లడించింది. ‘సైకి 16’ అనే ఆస్టరాయిడ్ వైపు నాసా 2023 అక్టోబర్లో ఓ స్పేస్ క్రాఫ్ట్ ను పంపింది. అంగారకుడు (మార్స్), బృహస్పతి (జూపిటర్) గ్రహాల మధ్య ఉన్న ఆస్టరాయిడ్ బెల్ట్ లో సైక్ 16 గ్రహశకలం ఉందని సైంటిస్టులు తెలిపారు. ఈ ఆస్టరాయిడ్ పేరునే స్పేస్ క్రాఫ్ట్ కు ‘సైకి’ అని పేరు పెట్టారు. లేజర్ కమ్యూనికేషన్లను పరీక్షించడానికి దీనిని ప్రయోగించారు. డీప్ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్స్ (డీఎస్ఓసీ) సిస్టమ్ తో సైక్ ను అభివృద్ధి చేశారు. సైక్ లో రేడియో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ వాడినప్పటికీ.. 22.53 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి (భూమికి, సూర్యుడికి మధ్య ఉన్న దూరం 15 కోట్ల కిలోమీటర్లు) భూమికి ఇంజినీరింగ్ డేటాను ట్రాన్స్ మిట్ చేసి డీఎస్ఓసీ టెక్నాలజీ తన సత్తా చాటుకుంది. భూమిపై సైక్ రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ మిట్టర్ తో సైక్ కమ్యూనికేట్ అయింది. అలాగే గత నెల 8న పది నిమిషాల డూప్లికేటెడ్ స్పేస్ క్రాఫ్ట్ డేటాను డౌన్ లింక్ చేశామని నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబరేటరీ (జేపీఎల్) లో ప్రాజెక్టు ఆపరేషన్ల చీఫ్ మీరా శ్రీనివాసన్ తెలిపారు. డీప్ స్పేస్ నుంచి సంప్రదాయ పద్ధతుల కన్నా మెరుగ్గా లేజర్ కమ్యూనికేషన్లు జరుగుతాయో లేదో తెలుసుకునేందుకు సైక్ ప్రయోగం చేశామని తెలిపారు.