ఏసీబీ అదుపులో నస్పూర్‌‌ ఎస్సై.. ఓ కేసులో రూ.2 లక్షలు సీజ్‌‌

ఏసీబీ అదుపులో నస్పూర్‌‌ ఎస్సై.. ఓ కేసులో రూ.2 లక్షలు సీజ్‌‌

మంచిర్యాల, వెలుగు : సీజ్‌‌ చేసిన సొమ్మును తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న మంచిర్యాల జిల్లా నస్పూర్‌‌ ఎస్సై నెల్కి సుగుణాకర్‌‌ను ఏసీబీ ఆఫీసర్లు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ విజయ్‌‌కుమార్‌‌ తెలిపిన వివరాల ప్రకారం... క్షుద్రపూజల పేరుతో మోసం చేశారంటూ నస్పూర్‌‌ మండలానికి చెందిన ప్రభంజన్‌‌ అనే వ్యక్తి  జనవరి 25న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్‌‌ చేసిన ఎస్సై సుగుణాకర్‌‌.. వారి వద్ద రూ. 2 లక్షలు సీజ్‌‌ చేశారు. అలాగే ఫిర్యాదుచేసిన ప్రభంజన్‌‌ను సైతం క్రిమినల్‌‌ కేసు పేరుతో బెదిరించి తన బినామీ ద్వారా రూ.30 వేలు  లంచం తీసుకున్నాడు. 

నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న రూ. 2 లక్షలను రిలీజ్‌‌ చేయాలని ప్రభంజన్‌‌ కోర్టును ఆశ్రయించగా అతనికి అనుకూలంగా ఈ నెల 4న కోర్టు తీర్పు ఇచ్చింది. బాధితుడికి డబ్బులు ఇచ్చిన ఫొటోలను కోర్టుకు సమర్పించాలని ఎస్సైని ఆదేశించింది. దీంతో ప్రభంజన్‌‌ ఈ నెల 5న ఎస్సైని సంప్రదించగా.. రూ.లక్షన్నర చేతిలో పెట్టి ఫొటో తీసిన తర్వాత తిరిగి తన డ్రాలో వేసుకున్నాడు. డబ్బులు తీసుకున్నట్లు రిసిప్ట్ మీద సంతకం పెట్టాలని ఎస్సై డిమాండ్‌‌ చేయడంతో.. డబ్బులు మొత్తం ఇస్తేనే సంతకం పెడుతానని ప్రభంజన్‌‌ స్పష్టం చేయడంతో తర్వాత రావాలని సూచించాడు. 

బాధితుడు తిరిగి ఈ నెల 8న స్టేషన్‌‌కు వెళ్లి డబ్బులు అడగడంతో ‘రూ. 50 వేలు మాత్రమే ఉన్నాయి.. మిగతావన్నీ ఖర్చయ్యాయి.. తీసుకుంటే తీసుకో.. లేదంటే లేదు, అసలు ఈ కేసులో నిన్ను కూడా అరెస్ట్‌‌ చేయాల్సింది.. కానీ వదిలేశాను’ అని బెదిరించాడు. దీంతో బాధితుడు ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. సమాచారం సేకరించిన ఏబీసీ ఆఫీసర్లు శుక్రవారం నస్పూర్‌‌ స్టేషన్‌‌పై ఆకస్మికంగా దాడి చేశారు. మిస్సింగ్‌‌ ప్రాపర్టీ కింద ఎస్సై సుగుణాకర్‌‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌‌కు తరలించినట్లు డీఎస్పీ వివరించారు. దాడిలో ఏసీబీ ఇన్ స్పెక్టర్లు స్వామి, కిరణ్‌‌రెడ్డి పాల్గొన్నారు.