టీ20 వరల్డ్ కప్ అంటే పరుగుల వరద అని ఫిక్స్ అయిపోతారు. అయితే న్యూయార్క్ నసావు కౌంటీ క్రికెట్ వేదికలో మాత్రం అభిమానులకు టెస్ట్ మ్యాచ్ లు చూడక తప్పడం లేదు. బౌండరీల సంగతి పక్కనపెడితే సింగిల్స్ తీయడానికి బ్యాటర్లు నానా తంటాలు పడ్డారు. ఇప్పటివరకు ఈ వేదికపై 8 మ్యాచ్ లు జరిగితే ఒక్కసారి కూడా 150 కు పైగా రాకపోవడం విశేషం. ఆటగాళ్లు వికెట్లు కాపాడుకునే క్రమంలో పరుగులు చేయడం మర్చిపోతున్నారు. స్వల్ప లక్ష్యాన్ని కూడా డిఫెండ్ చేసుకోవడం విశేషం.
బంతి ఆగి రావడం, అనూహ్యమైన బౌన్స్‌తో బ్యాటర్లకు చుక్కలు చూపించింది. పడిన ప్రాంతాన్ని బట్టి బంతి ఎటు దూసుకెళ్తుందో తెలియని పరిస్థితి. ఈ వేదికపై భారత్, ఐర్లాండ్ జరిగిన మ్యాచ్ లో చాలా మంది గాయాల నుంచి బయట పడ్డారు. ఐరిష్ బ్యాటర్లు క్రీజులో ఉండటం కన్నా.. ఔట్ అవ్వడం మంచిదన్నట్లుగా బ్యాటింగ్ చేశారు. అప్పటికే హ్యారి టెక్టర్, లోక్రాన్ టక్కర్‌లకు గాయాలయ్యాయి. ఛేదనలో భారత బ్యాటర్లు అలానే ఇబ్బంది పడ్డారు. బంతి వేగంగా తగలడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ మధ్యలోనే వైదొలిగాడు. రిషబ్ పంత్ సైతం గాయపడ్డాడు. దీంతో హై-ప్రొఫైల్ మ్యాచ్‌లకు ఇవి సరైన వేదికలు కావన్న విమర్శలు వచ్చాయి.
ఈ వేదికను త్వరలో కూల్చి వేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. నివేదికల ప్రకారం మరో 6 వారాల్లో పూర్తిగా స్టేడియాన్ని కూల్చేస్తారట. రూ.250 కోట్లు ఖర్చు పెట్టి మూడు నెలల పాటు కష్టపడి కట్టిన ఈ స్టేడియాన్ని ఎందుకు కూల్చేస్తున్నారనేది ప్రశ్నర్థకంగా మారింది. ఈ స్టేడియంపై వస్తున్న విమర్శలే దీనికి కారణం కావొచ్చు. ఇక్కడ కేవలం పిచ్ సమస్య అయితే అనుకోవచ్చు. కానీ అవుట్ ఫీల్డ్ కూడా చాలా మందకొండిగా ఉంది. దీంతో కూల్చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది.