జైశ్వాల్ నీ దగ్గర నుండి నేర్చుకోలేదు..ఇంగ్లాండ్ క్రికెటర్‌పై నాజర్ హుస్సేన్ ఫైర్

జైశ్వాల్ నీ దగ్గర నుండి నేర్చుకోలేదు..ఇంగ్లాండ్ క్రికెటర్‌పై నాజర్ హుస్సేన్ ఫైర్

రాజ్‌కోట్ టెస్టులో 3వ రోజు జైశ్వాల్ మెరుపు సెంచరీతో అదరగొట్టాడు. ప్రారంభంలో ఆచితూచి ఆడిన ఈ ముంబై కుర్రాడు.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బౌలర్లు ఎవరైనా పూనకం వచ్చినట్టు ఆడాడు. ఈ సెంచరీపై ఇంగ్లాండ్ ఓపెనర్ స్పందిస్తూ..జైశ్వాల్ బ్యాటింగ్‌లో అటాకింగ్ గా ఆడటానికి ఇంగ్లండ్‌కు కొంత క్రెడిట్ దక్కుతుందని డకెట్ అన్నాడు. డకెట్ మాటలకు తాజాగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ ఘాటుగా సమాధానం ఇచ్చాడు.

స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడిన హుస్సేన్.. జైస్వాల్ కష్టం అతన్ని మంచి స్థితిలో ఉంచిందని.. అది ఇతరులకు స్ఫూర్తినిస్తుందని చెప్పాడు. డకెట్ ను ఉద్దేశిస్తూ..  జైస్వాల్ అతను మీ నుండి నేర్చుకోలేదు. కష్టపడి ఉన్నత స్థితికి చేరుకున్నాడు. అతను ఎదిగిన తీరు చూసి  కుర్రాళ్ళు అతన్ని చూసి నేర్చుకోవాలి. మూడో టెస్ట్ ఓటమి తర్వాత ఎక్కడ తప్పులు చేశామోనని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటుందని భావిస్తున్నా. అన్ని సార్లు బాజ్‌బాల్ ఆట తీరు పని చేయదు. అని ఈ మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్ అన్నారు.

ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ దుమ్ము లేపుతున్నాడు. ఏకంగా డబుల్ సెంచరీలతో రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు. హైదరాబాద్ టెస్టులో సెంచరీ మిస్ అయిన ఈ యంగ్ స్టార్ ఆ తర్వాత వైజాగ్, రాజ్ కోట్ టెస్టుల్లో డబుల్ సెంచరీ బాదేశాడు. ఈ సిరీస్ లో ఇప్పటివరకు జరిగిన మూడు టెస్టుల్లో 109 యావరేజ్ తో 6 ఇన్నింగ్స్ ల్లో 545 పరుగులు చేసి  టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇంగ్లాండ్ ఓపెనర్ డకెట్ సైతం రాజ్ కోట్ లో జరిగిన మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 153 పరుగులు చేశాడు.