వీడియో: 4 బంతుల్లో 3 వికెట్లు.. ఇరగదీస్తున్న ఐపీఎల్ స్టార్ బౌలర్

వీడియో: 4 బంతుల్లో 3 వికెట్లు.. ఇరగదీస్తున్న ఐపీఎల్ స్టార్ బౌలర్

టీ20 క్రికెట్‌లో బ్యాటర్ల హవానే ఎక్కువ. 120 బంతులే కావడంతో బ్యాటర్లు ఆది నుంచే దూకుడు మంత్రాన్ని జపిస్తుంటారు. ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బౌలర్లపై ఎదురుదాడికి దిగుతారు. ఇలాంటి పొట్టి ఫార్మాట్‌లో బౌలర్లు రాణించడమన్నది చాలా అరుదు. కానీ ఆసీస్ ఆటగాడు,  పంజాబ్ కింగ్స్ స్టార్ నాథన్ ఎల్లీస్ బంతితోనూ అద్భుతాలు సృష్టించొచ్చు అని నిరూపిస్తున్నాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున పెద్దగా రాణించనప్పటికీ.. టీ20 బ్లాస్ట్‌లో మాత్రం ఇరగదీస్తున్నాడు.

ఈ టోర్నీలో హాంప్‌షైర్ తరఫున ఆడుతున్న ఎల్లీస్.. వార్సెస్టర్‌షైర్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌ మ్యాచ్‌లో బంతితో నిప్పులు చెరిగాడు. నాలుగు బంతుల్లో మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును కోలుకోలేని దెబ్బ కొట్టాడు. హాంప్‌షైర్ తరఫున ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన ఎల్లీస్.. ఒక్క పరుగు ఇవ్వకుండా మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 2.5 ఓవర్లు బౌలింగ్ చేసిన ఎల్లీస్.. 6 పరుగులిచ్చి నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.

ఎల్లీస్ ధాటికి వార్సెస్టర్‌షైర్‌ బ్యాటర్లు తేలిపోయారు. కేవలం 17.5 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌట్ అయ్యారు. అనంతరం 101 పపరుగుల లక్ష్యాన్ని హాంప్‌షైర్ 15.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో హాంప్‌షైర్ సెమీఫైనల్ లో అడుగు పెట్టింది.