ఆస్ట్రేలియా- భారత్ జట్ల మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉండడం గ్యారంటీ. ఈ రెండు జట్లు టెస్ట్ క్రికెట్ లో అసలైన మజాను చూపిస్తాయి. అగ్ర జట్లు.. స్టార్ ఆటగాళ్లు.. స్టేడియం నిండా ప్రేక్షకులు.. వెరసి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆసక్తికరంగా మారుస్తాయి. మరోసారి ఈ మెగా సిరీస్ అభిమానులకు కిక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సిరీస్ పై ఆసీస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్ తన జోస్యాన్ని చెప్పుకొచ్చాడు. భారత్ ను 5-0 తేడాతో ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
విల్లో టాక్ పోడ్‌కాస్ట్‌లో అలిస్సా హీలీతో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ మాట్లాడుతూ.. "ఆస్ట్రేలియా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెలిచి 10 సంవత్సరాలు అయ్యింది. ప్రస్తుతం నా దృష్టాంతా ఈ సిరీస్ పైనే ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా ఈ సారి 5-0 తేడాతో గెలుస్తుంది". అని లియాన్ చెప్పుకొచ్చాడు. ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీలో ఈ ఆసీస్ స్పిన్నర్ 27 మ్యాచ్‌లలో 31.56 సగటుతో 121 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
రోహిత్ శర్మ కెప్టెన్ గా భారత్ ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. నవంబర్ 22 నుంచి జనవరి 3 వరకు ఈ సిరీస్ జరుగుతుంది. ఆస్ట్రేలియా గడ్డపై చివరగా జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను భారత జట్టు గెలుచుకుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ 72 ఏళ్లలో తొలిసారి 2-1 తేడాతో ఆసీస్ గడ్డపై సిరీస్ గెలిస్తే.. 2020-21లో తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే సారధ్యంలో 2-1 తేడాతో సిరీస్ గెలుచుకుంది. చివరిసారిగా 2023 లో నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో గెలుచుకోవడం విశేషం.
Nathan Lyon's BGT series prediction 👀#INDvsAUS pic.twitter.com/1mEbPycnVQ
— CricXtasy (@CricXtasy) September 17, 2024