Border-Gavaskar Trophy: రోహిత్, కోహ్లీ కాదు అతడే మాకు పెద్ద ఛాలెంజ్: ఆస్ట్రేలియా స్పిన్నర్

Border-Gavaskar Trophy: రోహిత్, కోహ్లీ కాదు అతడే మాకు పెద్ద ఛాలెంజ్: ఆస్ట్రేలియా స్పిన్నర్

భారత్ తో జరగబోయే ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా ఇప్పటి నుంచే సన్నాహకాలు ప్రారంభిస్తుంది. నవంబర్ లో ప్రారంభం కానున్న ఈ మెగా సిరీస్ అభిమానులకు కిక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. రోహిత్ శర్మ కెప్టెన్ గా భారత్ ఐదు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. నవంబర్ 22 నుంచి జనవరి 3 వరకు ఈ సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్ కు మరో మూడు నెలల సమయం ఉండగానే ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ టీమిండియా బ్యాటర్ యశస్వి జైస్వాల్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. 

లియాన్  మాట్లాడుతూ.. “నేను యశస్వి జైస్వాల్‌కి బౌలింగ్ చేయలేదు. అతనికి బౌలింగ్ చేయడం మా బౌలర్లకు సవాలుగా మారనుంది. అతడు ఈ ఏడాది స్వదేశంలో ఇంగ్లండ్‌పై బ్యాటింగ్ చేసిన విధానాన్ని నేను నిశితంగా చూశాను. సిరీస్ అంతటా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. నేను టామ్ హార్ట్లీతో మాట్లాడాను. అతను భారత బ్యాటర్లకు బౌలింగ్ చేసిన విధానం గురించి చెప్పాడు. భారత్‌పై జరిగిన సిరీస్ లో అతను 20 వికెట్లు పడగొట్టాడు. జైస్వాల్ బ్యాటింగ్ గురించి అతనికి చాలా తెలుసు". అని ఈ ఆసీస్ స్పిన్నర్ టీమిండియా యువ ఓపెనర్ గురించి చెప్పుకొచ్చాడు. 

స్వదేశంలో ఇంగ్లాండ్ తో ఈ ఏడాది ప్రారంభంలో భారత్ 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను భారత్ 4-1 తేడాతో గెలుచుకోగా.. టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ విశ్వరూపమే చూపించాడు. 5 టెస్టుల్లో మొత్తం 712 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అతని దూకుడు ధాటికి ఇంగ్లాండ్ బౌలర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. మరోవైపు 129 టెస్టులాడి 530 వికెట్లు పడగొట్టిన లియాన్.. భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో విజయం సాధించేందుకు ఆసీస్‌కే అత్యుత్తమ అవకాశం ఉందన్నాడు.

ఆస్ట్రేలియా గడ్డపై చివరగా జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను భారత జట్టు గెలుచుకుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్  72 ఏళ్లలో తొలిసారి 2-1 తేడాతో ఆసీస్ గడ్డపై సిరీస్ గెలిస్తే.. 2020-21లో తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే సారధ్యంలో 2-1 తేడాతో సిరీస్ గెలుచుకుంది. చివరిసారిగా 2023 లో నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో గెలుచుకోవడం విశేషం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025 సైకిల్ లో భాగంగా ఈ సిరీస్ ఇరు జట్లకు కీలకంగా మారనుంది.