బిపిన్ దంపతుల అంత్యక్రియలు చేసిన కుమార్తెలు

బిపిన్ దంపతుల అంత్యక్రియలు చేసిన కుమార్తెలు

హెలికాప్టర్‌‌ ప్రమాదంలో అమరులైన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్‌లకు యావత్ దేశం కన్నీటి వీడ్కోలు పలికింది. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని బ్రార్‌‌ స్క్వేర్‌‌ శ్మశాన వాటికలో వారిద్దరి అంత్యక్రియలు సైనిక లాంఛనాల మధ్య శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ముగిశాయి. వారి కుమార్తెలు కృతిక, తరుణి ఇద్దరు కలిసి చితికి నిప్పుపెట్టి అంతిమ సంస్కారాలు చేశారు. ఈ సమయంలో సైనికులు 17 గన్ సెల్యూట్‌తో గౌరవ వందనం తెలిపారు.

 సూర్యచంద్రులు ఉన్నంత కాలం.. బిపిన్ పేరు నిలిచిపోతది

అంతకుముందు బిపిన్ రావత్ దంపతుల అంతిమయాత్రలో  భారీగా జనం పాల్గొని కన్నీటి నివాళి అర్పించారు. ఢిల్లీలోని వారి ఇంటి నుంచి ఆర్మీ వాహనంలో  బయలుదేరిన వారి పార్ధివదేహాలకు తుది వీడ్కోలు చెప్పేందుకు జనం వెంట నడిచి వచ్చారు. భ‌రత భూమి పుత్రుడు రావ‌త్ అమ‌ర్ ర‌హే అంటూ నినాదాలు చేశారు. బిపిన్ రావ‌త్ అమ‌ర్ ర‌హే.. సూర్యచంద్రులు ఉన్నంత కాలం.. బిపిన్ పేరు నిలిచిపోతదంటూ దేశ వీరుడికి జ‌నం వంద‌నాలు ప‌లికారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన అంతిమయాత్ర  బ్రార్ స్క్వేర్‌‌ శ్మశాన వాటిక చేరుకోవడానికి సాయంత్రం నాలుగు గంటలకు చేరుకుంది. ఆ తర్వాత శ్రీలంక, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చిన ఆయా దేశాల సైన్యాధ్యక్షుడు, సీనియర్ కమాండర్లు నివాళి అర్పించారు. అలాగే మన దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సహా పలువురు ప్రముఖులు, బిపిన్ కుటుంబసభ్యులు  అశ్రు నివాళి అర్పించారు.