
నిర్భయ దోషులను మహిళతో ఉరితీయించాలంటూ రక్తపు లేఖ
నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో దోషులుగా తేలిన నలుగురిని ఒక మహిళతో ఉరితీయించాలని కోరుతూ నేషనల్ ఏస్ షూటర్ వర్తికా సింగ్; కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రక్తంతో లేఖ రాశారు.
‘నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో దోషులుగా తేలిన నలుగురిని ఉరి తీయడానికి మహిళనైన నన్ను అనుమతించాలి. దాంతో ఒక మహిళ కూడా ఉరిశిక్షను అమలు చేయగలదని దేశవ్యాప్తంగా ఒక సందేశం వెళుతుంది. ఒక మహిళ వారి మరణశిక్షను అమలు చేస్తే ఎలా ఉంటుందో రేపిస్టులు తెలుసుకోవాలి. ఈ విషయంపై నాకు నటీమణులు, ఎంపీలు మద్దతు ఇవ్వాలి. ఇలా చేస్తే సమాజంలో మార్పు వస్తుందనుకుంటాను. మహిళలు ప్రతిరోజూ భయంతో బతకకూడదు’అని వర్తికా అన్నారు.
డిసెంబర్ 16, 2012న 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిని కదిలే బస్సులో సామూహిక అత్యాచారం చేశారు. ఆ కేసుకు సంబంధించి.. నలుగురు దోషుల్లో ఒకరు దాఖలు చేసిన సమీక్ష పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించనుంది. దోషులు ఆరుగురిలో ఒకరు మైనర్ కావడంతో అతన్నిబాల న్యాయస్థానం ముందు హాజరు పరచగా… జువైనల్ కోర్టుకు తరలించారు. కాగా, మరో నిందితుడు రామ్ సింగ్ తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు.
మిగిలిన నలుగురు దోషులు ముఖిష్, అక్షయ్, పవన్ మరియు వినయ్‌లు ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లగా.. వారికి సెప్టెంబర్ 2013లో ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది.