గోదావరి– కావేరి లింక్‌‌పై 3న సమావేశం

గోదావరి– కావేరి లింక్‌‌పై 3న సమావేశం
  • 148 టీఎంసీల్లో సగం ఇవ్వాల్సిందేనంటున్న మన అధికారులు
  • ఇప్పటికే ఎన్‌డబ్ల్యూడీఏకి రిప్లై ఇస్తూ లేఖ

హైదరాబాద్, వెలుగు: నదుల అనుసంధానంపై నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎండబ్ల్యూడీఏ) మరోమారు సమావేశం నిర్వహించనుంది. వచ్చే నెల 3న ఢిల్లీలో హైబ్రిడ్ మోడ్‌లో ఈ సమావేశాన్ని నిర్వహించనుంది. గోదావరి కావేరి లింక్‌తోపాటు దేశంలో చేపట్టిన వివిధ అనుసంధాన ప్రాజెక్టులు, వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన ఇంట్రా లింక్ ప్రాజెక్టులపై ఆయా రాష్ట్రాలతో చర్చించనుంది. గోదావరి–కావేరి లింక్‌కు సంబంధించి డిసెంబర్​లోపు తెలంగాణ, చత్తీస్‌గఢ్​ల మధ్య ఒప్పందాన్ని ఫైనల్ చేయించాలని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రయత్నాలు చేస్తున్నది.

ఈ లింక్ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇచ్చంపల్లి- –సాగర్ కనెక్షన్​కు ఓ డీపీఆర్, నాగార్జునసాగర్-– పెన్నా (సోమశిల) కనెక్టివిటీకి మరో డీపీఆర్, పెన్నా-–కావేరి కనెక్టివిటీకి ఇంకో డీపీఆర్ సహా మొత్తం మూడు డీపీఆర్‌లను 2021లోనే పూర్తి చేసి ఆమోదించగా.. నీటి వాటాలు, బ్యారేజీ ఎత్తుపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది.

 బ్యారేజీ ఎత్తును 83 నుంచి 87 మీటర్ల వరకు తెలంగాణ ప్రతిపాదిస్తుండగా చత్తీస్‌గఢ్​ ఒప్పుకోవట్లేదు. ప్రాజెక్ట్ ద్వారా తరలించాలనుకుంటున్న 148 టీఎంసీల నీటిలో సగం వాటా ఇవ్వాలని మన రాష్ట్రం పట్టుబడుతున్నా.. 33 శాతానికి ఒప్పుకోవాలని ఎన్‌డబ్ల్యూడీఏ చెప్తున్నది. అయితే ఆ ప్రతిపాదనలకు ఒప్పుకొనే ప్రసక్తే లేదని, ఇప్పటికే ఎన్‌డబ్ల్యూడీఏకి లేఖ కూడా రాశామని అధికారులు చెబుతున్నారు.