బీసీలను విస్మరిస్తే సహించం: ఆర్. కృష్ణయ్య

న్యూఢిల్లీ, వెలుగు: దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలవి భిక్షపు బతుకులు కావని, ఆ వర్గాన్ని విస్మరిస్తే సహించబోమని కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. దేశంలో సింహభాగంగా ఉన్న బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్‌‌‌‌‌‌‌‌ మంతర్‌‌‌‌‌‌‌‌ వద్ద బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్‌‌‌‌‌‌‌‌ ఎం.లాల్‌‌‌‌‌‌‌‌కృష్ణ, గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, భరత్, శరత్, పితానీ ప్రసాద్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. దీనికి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి, ఎంపీలు ఆర్. కృష్ణయ్య, బీద మస్తాన్ రావు తదితరులు అటెండ్ అయ్యారు. ఆందోళనలో భాగంగా బీసీ నేతలు పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ ముట్టడికి ప్రయత్నించారు.

అప్రమత్తమైన పోలీసులు వీరిని అడ్డుకోవడంతో కాసేపు  ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు, బీసీ సంఘాల నేతలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీల ఉద్యమానికి బీసీ నాయకులు, ఉద్యోగులు నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. అప్పుడే కేంద్ర ప్రభుత్వం బీసీల సమస్యలను పరిష్కరిస్తుందన్నారు. దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలు కులాల పేరు మీద విడిపోవడంతో న్యాయపరమైన సమస్యలను సాధించలేకపోతున్నామని చెప్పారు. కేంద్ర శాఖల్లో ఉన్న 56లక్షల ప్రభుత్వ ఉద్యోగుల్లో బీసీలు కేవలం 7లక్షల 50వేలు మాత్రమే ఉండటం దారుణమన్నారు. 

బీసీలకు కాంగ్రెస్ అండగా ఉంది 

బీసీల సమస్యలకై నిరంతరం పోరాటం చేసేందుకు ముందు నిలుస్తామని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి అన్నారు. బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగానే ఉంటుందని చెప్పారు. తెలంగాణలో బీసీ కుల గణనకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో వెనక బడిన వర్గాలు కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచి, 17 లోక్ సభ స్థానాల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. జనగణనలో కులగణన చేయడానికి కేంద్రంపై ప్రతిపక్ష పార్టీలు ఒత్తిడి తేవాలని రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్‌‌‌‌‌‌‌‌రావు, బీఎస్పీ ఎంపీ శ్యాంసింగ్ కోరారు. విద్యా, ఉద్యోగ నియమాకాల్లో బీసీ రిజర్వేషన్లపై క్రిమిలేయర్‌‌‌‌‌‌‌‌ నిబంధన విధించిన తీరు బీసీలపై వివక్ష, చిన్నచూపుకు నిదర్శనమేనని పేర్కొన్నారు. 

ALSO READ: బీసీలకు ఎక్కువ సీట్లు! లోక్ సభ ఎన్నికల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం