ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
ముషీరాబాద్, వెలుగు: తెలంగాణ సాయుధ పోరాటం నుంచి సాధన ఉద్యమం వరకు పుస్తకాలే నడిపించాయని మంత్రి శ్రీనివాస్గౌడ్చెప్పారు. ఎన్టీఆర్‌స్టేడియంలో లక్షల పుస్తకాలతో ఏర్పాటైన 35వ హైదరాబాద్నేషనల్ బుక్‌ఫెయిర్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పుస్తకాలతోనే సమాజంలో మార్పు వస్తుందన్నారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా పుస్తక పఠనం, పుస్తక జ్ఞానం శాశ్వతం అన్నారు. సెల్ ఫోన్ ద్వారా మంచి కంటే చెడు ఎక్కువగా ప్రచారం జరుగుతుందన్నారు. దాన్ని అధిగమించేందుకు పుస్తక పఠనం చాలా అవసరమని చెప్పారు. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. చరిత్ర మొత్తం నిక్షిప్తమయ్యేది పుస్తకంలోనే అన్నారు. కొంతమంది చరిత్రను వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది దేశానికి అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం విద్యార్థుల ఆత్మ బలిదానాలు, కేసీఆర్ పోరాటం పుస్తకంలో నిక్షిప్తమై ఉందని చెప్పారు. విద్యార్థులు చరిత్ర పుస్తకాలను అధ్యయనం చేయాలని సూచించారు. సీనియర్ జర్నలిస్ట్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ.. పుస్తకాలు చదవడం వల్ల 20 నుంచి 50 శాతం వరకు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుందని చెప్పారు. కొత్త పదాలను నేర్చుకునేందుకు వీలుంటుందన్నారు. ప్రతి విద్యార్థి ఏడాదిలో 10 పుస్తకాలు చదవాలని, మరొకరితో చదివించాలని కోరారు. మొదటిరోజు బుక్ఫెయిర్లో పుస్తక ప్రియులతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. స్టాల్స్వద్ద సందడి కనిపించింది.
డీహెచ్ఆర్డీజీ, ఐసీఎంఆర్ సెక్రటరీ రాజీవ్బహల్
సికింద్రాబాద్, వెలుగు: రోజురోజుకు పెరిగిపోతున్న డయాబెటిస్‌పై విస్తృత పరిశోధనలు జరగాలని డీహెచ్ఆర్డీజీ, ఐసీఎంఆర్సెక్రటరీ డాక్టర్ రాజీవ్బహల్ చెప్పారు. దేశంలో డయాబెటిక్ పేషెంట్ల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతోందని, నివారణ చర్యలు చేపట్టకపోతే పరిస్థితి దారుణంగా మారే అవకావం ఉందన్నారు. తార్నాకలోని ఎన్ఐఎన్(జాతీయ పోషకాహార సంస్థ)లో న్యూట్రిషన్సొసైటీ ఆఫ్ఇండియా గురువారం 54వ వార్షిక సదస్సు నిర్వహించింది. ఇందులో వర్చువల్ మోడ్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆహారపు అలవాట్లపై అధ్యయనం చేయాలని, రోజుకు ఎంత ఆహారం తీసుకోవాలి, ప్రొటీన్, కార్బోహైడ్రేట్లు ఎంత పరిమాణంలోఉండాలనేదానిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత యువ సైంటిస్టులపై ఉందన్నారు. ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత మాట్లాడుతూ రైస్‌ను అధికంగా తీసుకోవడం వల్ల డయాబెటిస్ బారినపడుతున్నట్లు సర్వేలు చెపుతున్నాయని, దాన్ని నియంత్రించేందుకు ఆహారపు ఇండెక్స్‌ను తయారు చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రపతి శీతాకాల విడిది ఏర్పాట్ల పరిశీలన
శామీర్ పేట, వెలుగు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం ఈనెల 26న హైదరాబాద్ రానున్న నేపథ్యంలో మేడ్చల్ -జిల్లా పరిధిలోని హకీంపేట ఎయిర్ పోర్టును కలెక్టర్ హరీశ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గురువారం పరిశీలించారు. ఎయిర్‌పోర్టులో చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్తలు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రపతి వచ్చి తిరిగి వెళ్లే వరకు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎయిర్ పోర్టు నుంచి బొల్లారం వెళ్లే రోడ్డులోని గుంతలను పూడ్చడం, కొత్త రోడ్డు వేసేలా చర్యలు చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాస్ మూర్తికి సూచించారు. రాష్ట్రపతి వచ్చి వెళ్లేంతవరకు పవర్కట్ఉండకుండా చూడాలని, అవసరమైతే జనరేటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. అడిషనల్కలెక్టర్ అభిషేక్ అగస్త్య, ఎయిర్ పోర్టు చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ నరేంద్ర వర్మ, వింగ్ కమాండర్ చౌదరి, జీఏడీ, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.