ఆర్థిక ప్రగతిలో... సీఏల పాత్ర కీలకం!

ఆర్థిక ప్రగతిలో... సీఏల పాత్ర కీలకం!

1 జులై 1949న ‘ఇనిస్టిట్యూట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ చార్టర్డ్‌‌‌‌ అకౌంటెంట్స్ ఆఫ్‌‌‌‌ ఇండియా (ఐసీఏఐ)’ సంస్థ పార్లమెంట్‌‌‌‌లో చట్టం ద్వారా ఏర్పడింది.  ప్రపంచంలోనే అకౌంటింగ్‌‌‌‌, ఫైనాన్షియల్‌‌‌‌  విషయాలను నిర్వహించే రెండవ అతి పెద్ద వృత్తి నిబద్ధతగల సంస్థగా  ఐసీఏఐ పేరు సంపాదించుకుంది. ఐసీఏఐ ఏర్పడిన జులై 1 రోజున  ప్రతి ఏటా  దేశవ్యాప్తంగా ‘జాతీయ చార్టర్డ్​ అకౌంటెంట్స్‌‌‌‌ (సీఏ) దినోత్సవం నిర్వహించుట ఆనవాయితీగా జరుగుతున్నది. ఐసీఏఐ లోగోలో గరుడ పక్షితో పాటు  శ్రీ అరబిందో  సూచించిన కఠోపనిషత్​ సూక్తి ‘యే ఈష  సుప్తేషు జాగృతి’ని పొందుపరిచారు. 

1913లో  బ్రిటీష్‌‌‌‌  ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంపెనీల చట్టం ద్వారా ఆడిటర్లను నియమించడం జరిగింది. 1918లో  ‘గవర్నమెంట్‌‌‌‌ డిప్లమా ఇన్‌‌‌‌ అకౌంటెన్సీ’ కోర్సును ప్రవేశపెట్టడం జరిగింది. ఆడిటర్లుగా ఎంపికైన అభ్యర్థులకు 3 ఏండ్ల శిక్షణ కాలం ఉండేది. 1930లో  భారత ప్రభుత్వం ‘రిజిస్టర్డ్  అకౌంటెంట్ల’  జాబితా నమోదు చేయడం ప్రారంభించింది. అనంతరం 1948లో  నియమించిన కమిటీ సిఫార్సులతో 1 జులై 1949 రోజున ఐసీఏఐ సంస్థను చట్టం ద్వారా స్థాపించడమైంది.  ఆ రోజు నుంచి ఇండియన్‌‌‌‌ అకౌంటెంట్లను ‘చార్టర్డ్‌‌‌‌ అకౌంటెంట్లు లేదా సీఏ’గా పిలవడం ఆనవాయితీగా మారింది. 

చిరు వ్యాపారం నుంచి బహుళజాతి సంస్థ వరకు, చిన్న ఉద్యోగి నుంచి బడా బాబుల వరకు అందరి ఆర్థిక లావాదేవీలను  క్రమపద్ధతిలో చట్టబద్దంగా ఆదాయ, వ్యయాల జాబితాను నిర్వహించే అమూల్య బాధ్యత  సీఏలపై ఉంటుంది. దేశ ఆర్థిక క్రమశిక్షణను నియంత్రించే బాధ్యతలను సీఏలు భుజాన వేసుకుని నడిపిస్తున్నారు. అతి గౌరవప్రదమైన సీఏ వృత్తిని చేపట్టినవారికి ఆకర్షణీయ ఆదాయం ఉంటుంది. సీఏ వృత్తి ద్వారా ఉద్యోగ, ఉపాధి, వ్యాపార రంగాల్లో,  వ్యక్తిగతంగా,  కంపెనీల పరంగా  జమ, ఖర్చుల విశ్లేషణతో పాటు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఆదాయ పన్నులను నిర్ణయించే  చెల్లింపులు జరిగేలా సీఏలు సేవలు అందిస్తారు. 

 

సీఏ ఎంపికలో ప్రతిభకే పట్టం

ఐసీఏఐ నిర్వహించే ఉన్నత ప్రమాణాలతో కూడిన కఠిన సీఏ పరీక్షలో  వేల సంఖ్యలో అభ్యర్థులు పాల్గొన్నప్పటికీ కొద్దిమంది మాత్రమే ఉత్తీర్ణత సాధిస్తారు. దేశంలో ఐసీఏఐ నుంచి సర్టిఫికెట్‌‌‌‌ పొందిన తొలి వ్యక్తిగా ‘గోపాల్‌‌‌‌దాస్‌‌‌‌ పదమ్సే కపాడియా’ గుర్తింపు పొంది,  ఐసీఏఐ ప్రథమ అధ్యక్షుడిగా సేవలు అందించారు.  స్వతంత్ర భారతావనిలో అతి పురాతన సంస్థల్లో ఒకటిగా పేరుగాంచిన ఐసీఏఐలో ఎలాంటి రిజర్వేషన్లు ఉండవు. 

 ప్రతిభ ఆధారంగా మాత్రమే సీఏలను కఠిన నియమావళితో కూడిన పరీక్షల ద్వారా వడపోసి ఎంపిక చేస్తారు. సామాన్య జనులు ‘జాతీయ సీఏల దినోత్సవం’ నాడు  ఆ వృత్తిలో అత్యున్నత సేవలు అందిస్తున్న సీఏలను గుర్తించి సన్మానించడం జరుగుతున్నది. సీఏ వృత్తి పట్ల అవగాహన,  ఐసీఏఐ బాధ్యులను గుర్తించడం,  ర్యాలీలు,  సమావేశాలు నిర్వహిస్తారు.  నేటి విద్యార్థినీ , విద్యార్థులు, ఉన్నత విద్యనభ్యసించిన యువత సీఏ పరీక్షలో ఉత్తీర్ణులై  దేశం గర్వించే  సీఏలుగా ఎంపిక కావాలని కోరుకుందాం.   జాతీయ సీఏల దినోత్సవం  సందర్భంగా చార్టర్డ్‌‌‌‌ అకౌంటెంట్స్​కు శుభాకాంక్షలు తెలియజేద్దాం. 

- డా: బుర్ర మధుసూధన్‌‌‌‌ రెడ్డి