
అశ్వారావుపేట/చండ్రుగొండ/ములకలపల్లి, వెలుగు: ఉచితాల పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలను అప్పులు పాలు చేశారని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ విమర్శించారు. భారీ వర్షాలకు కొట్టుకుపోయిన భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్టును, చండ్రగొండ మండలంలోని వెంగళరావు సాగర్ ప్రాజెక్టులో ధ్వంసమైన అలుగు ప్రాంతాలను ఆయన సోమవారం పరిశీలించారు. అనంతరం సభలో ఆయన మాట్లాడుతూ.. మూడు వేల ఎకరాలు ఉన్న ప్రాజెక్టు అలుగు ధ్వంసమై ఆరేండ్లు గడుస్తున్నా ప్రభుత్వాలు, ఆఫీసర్లు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.
ఎస్టీలకు పోడు పట్టాలు ఇచ్చిన కరెంటు, బోరు వేసుకోవాలంటే ఫారెస్ట్ ఆఫీసర్లు ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఒక దశలో ఆయన అసభ్య పదజాలంతో అధికార, ప్రతిపక్షాలను తిట్టడంతో రైతులు అసహనానికి గురవడమే కాకుండా అధికారులు కూడా ఆందోళన చెందారు. కొందరు రైతులు లేచి వెళ్లిపోయారు. భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.