శ్రీనగర్: పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే) భారత్‌లో విలీనం అవుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ ఫరూఖ్ అబ్దుల్లా అక్కసు వ్యక్తంచేశారు. శ్రీనగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘పీవోకే భారత్‌లో విలీనం అవుతుందని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. అది ఆయన అభిప్రాయం. కానీ, ఒక్క విషయం గుర్తుంచుకోండి. పాకిస్తాన్ ఏమీ గాజులు వేసుకొని కూర్చోలేదు. వాళ్ల దగ్గరా అణుబాంబులు ఉన్నాయి. మన దురదృష్టం కొద్దీ ఎప్పుడన్నా మన మీద ఆ బాంబులు వేయవచ్చు” అని ఫరూఖ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కాగా, గత నెల బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో జరిగిన ర్యాలీలో రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఏదో ఒకరోజు పీవోకే భారత్‌లో విలీనం కాక తప్పదన్న పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యానించారు. ‘‘ఇండియా పవర్ రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచ దేశాలు గౌరవిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ కూడా దూసుకుపోతున్నది. ఇలాంటి పరిణామాలను గమనిస్తే తమను భారత్‌లో కలపాలని పీవోకే ప్రజలే డిమాండ్ చేసే రోజు వస్తుంది” అని రాజ్‌నాథ్ చెప్పారు. అలాగే విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ కూడా పీవోకే భారత్‌లో భాగమని ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో స్పష్టం చేశారు.