
వారణాసిలో 19 ఏళ్ల యువతిని హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేసి వీడియో తీసిన నిందితుడు, ఆ వీడియోను అడ్డం పెట్టుకుని వారం రోజుల్లో 22 మందితో సామూహిక అత్యాచారం చేయించాడు. ఈ సంఘటనపై ప్రధాని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఊరుకొండ పేటలో దైవదర్శనం కోసం వచ్చిన మహిళపై ఏడుగురు లైంగిక దాడి చేసి, ఆ దృశ్యాలను వీడియో తీసి, ఫిర్యాదు చేస్తే - సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు.
బాధితులను మానసికంగా కుంగదీసి, చట్టం నుంచి తప్పించుకోవచ్చనే ధీమా దేశవ్యాప్తంగా నేరస్థుల్లో కనిపిస్తోంది. స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియాను ఉపయోగించుకుని జరుగుతున్న సరికొత్త ‘సాంకేతిక లైంగిక హింస’ లైంగిక వేధింపుల కంటే తీవ్ర నేరంగా పరిణమిస్తోంది. యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫాంలు కృత్రిమ మేధస్సు, మానవ పర్యవేక్షణతో అభ్యంతరకర వీడియోలను అప్‌లోడ్ అయ్యేటప్పుడే గుర్తించి తొలగిస్తాయి. కానీ, వాట్సాప్‌లో ఎండ్- టు- ఎండ్ ఎన్‌క్రిప్షన్ వల్ల అభ్యంతరకర సమాచారాన్ని ముందస్తుగా గుర్తించడం అసాధ్యం. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప వాట్సాప్ చర్యలు తీసుకోలేదు.
ఫిర్యాదుల కోసం నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్
ఫిర్యాదు అందని పక్షంలో హానికరమైన కంటెంట్ విచ్చలవిడిగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. అభ్యంతరకర వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నప్పుడే గుర్తించి, తొలగించగలిగే సామర్థ్యం యూట్యూబ్ వంటి వేదికలకు ఉంది. ఇందుకు కృత్రిమ మేధస్సుతోపాటు మానవ పర్యవేక్షణను కూడా అవి ఉపయోగిస్తున్నాయి. కానీ, వాట్సాప్ వంటి వేదికల్లో ఎండ్- టు- ఎండ్ ఎన్‌క్రిప్షన్ వల్ల గోప్యతకు పెద్దపీట వేయడంతో, అభ్యంతరకర సమాచారాన్ని ముందస్తుగా గుర్తించడం, ప్రభుత్వ పర్యవేక్షణ దాదాపు అసాధ్యం.
ఎవరైనా ఫిర్యాదు చేసేవరకు హానికరమైన కంటెంట్ విచ్చలవిడిగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. సాంకేతిక లైంగిక వేధింపులపై ఫిర్యాదుల కోసం ‘నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్’ (1930) ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆర్థిక నేరాలపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తుండటంతో, నగ్నచిత్ర వేధింపులపై ఈ పోర్టల్ పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతోంది. డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టం, 2023, సెక్షన్ 12 (3) ద్వారా అభ్యంతరకర చిత్రాలు, వీడియోలను ఇంటర్నెట్ నుంచి తొలగించాలని కోరే హక్కును పౌరులకు కల్పించింది.
ప్రపంచానికే ఆదర్శం ఒలింపియా చట్టం
ఉల్లంఘనలపై రూ.50 కోట్ల వరకు జరిమానా విధించే అధికారం ‘డేటా పరిరక్షణ బోర్డు’కు ఉంటుంది. ఈ చట్టం ఇంకా అమలులోకి రావాల్సి ఉంది. మెక్సికో మహిళ 'ఒలింపియా మెలో' తన అభ్యంతర వీడియో వైరల్ అయినా కుంగిపోకుండా పోరాడి సాధించుకున్న 'ఒలింపియా చట్టం' ప్రపంచానికే ఆదర్శం. జర్మనీ నెట్‌వర్క్ ఎన్ఫోర్స్మెంట్ చట్టం (NetzDG) ప్రకారం, హానికరమైన కంటెంట్‌ను సోషల్ మీడియా వేదికలు 24 గంటల్లో తొలగించకపోతే 50 మిలియన్ల జరిమానా ఉంటుంది. ఆస్ట్రేలియా ప్రపంచంలోనే మొదటిసారిగా చట్టబద్ధంగా స్థాపించిన 'ఇ-సేఫ్టీ కమిషనర్' అభ్యంతరకర కంటెంట్‌పై సులభంగా ఫిర్యాదు చేయడానికి, వాటిని వేగంగా తొలగించడానికి సమర్థవంతంగా పనిచేస్తోంది.
బ్రిటన్ ‘రివెంజ్ పోర్న్ హెల్ప్‌లైన్’ (StopNCII.org) ద్వారా లక్షలాది అభ్యంతరకర ఫొటోలను తొలగించగలిగింది. వారణాసి, ఊరుకొండ పేట వంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మెక్సికో తరహాలో అభ్యంతరకర చిత్రాలను మొదట పోస్ట్ చేసే, ఫార్వర్డ్ చేసేవారిని కూడా కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేక చట్టాలను తీసుకురావాలి. ఆస్ట్రేలియా తరహాలో ఫిర్యాదులను స్వీకరించి, కంటెంట్‌ను వేగంగా తొలగించేందుకు ప్రత్యేక వ్యవస్థను బలోపేతం చేయాలి. ఫిర్యాదులపై సోషల్ మీడియా సంస్థలు తక్షణమే స్పందించేలా చూడాలి. జర్మనీ తరహాలో భారీ జరిమానాలు విధించేలా నిబంధనలను కఠినతరం చేయాలి. మహిళలను గౌరవించి, వారి సాధికారతను కోరుకునే పురుషులను యువతకు ఆదర్శంగా చూపడం కీలకం.
శ్రీనివాస్ మాధవ్, సమాచార హక్కు పరిశోధకుడు