- కుంగిన చోట 25 మీటర్ల లోతు తవ్వి పరీక్షలు
- ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణుల బృందం.. వారం రోజుల పాటు కొనసాగనున్న టెస్టులు
జయశంకర్ భూపాలపల్లి / మహాదేవ్‌పూర్, వెలుగు: నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) సూచనలు, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల వద్ద సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్) నిపుణుల బృందం బుధవారం టెస్ట్‌లు ప్రారంభించింది. వారం రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహించి మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడానికి గల కారణాలను తెలుసుకోనున్నది. ఫ్యూచర్లో బ్యారేజీ పనికొస్తుందా? లేదా? తేలేది ఈ పరీక్షలతోనే అని నిపుణులు చెప్తున్నరు. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ గతేడాది అక్టోబర్ 21న భూమిలోకి కుంగింది.
బ్యారేజీని పరిశీలించిన ఎన్‌డీఎస్‌ఏ ఆఫీసర్లు.. కుంగడానికి గల కారణాలు తెలుసుకోవడానికి ఎలాంటి పరీక్షలు చేయాలో ఇటీవల ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో సూచించింది. బ్యారేజీ దిగువన భూమి లోపల ఎలా ఉందో తెలుసుకునేందుకు ఢిల్లీకి చెందిన సీఎస్ఎంఆర్ఎస్ సంస్థతో పరీక్షలు చేయించాల్సిందిగా తెలిపింది. ఈ నివేదిక ప్రకారం భవిష్యత్‌లో చేపట్టాల్సిన చర్యల గురించి వివరిస్తామని తెలిపింది. ఎన్‌డీఎస్‌ఏ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థను సంప్రదించి, టెస్ట్‌లకు అవసరమైన రూ.2 కోట్లకు పైగా ఫీజును చెల్లించింది.
దీంతో సీఎస్ఎంఆర్ఎస్ సంస్థ ప్రతినిధి హరిదేవ్ తో పాటు ఆరుగురు సభ్యుల బృందం బుధవారం మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్నది. స్పెషల్ ఎక్విప్మెంట్లతో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో ఉపయోగించిన మెటీరియల్, మట్టి నమూనాలను సేకరిస్తున్నది. బ్యారేజీలో కుంగిన 7వ బ్లాక్‌లోని పిల్లర్ల వద్ద టెస్టులు ప్రారంభించింది.
ఏడో బ్లాక్‌లోని అన్ని పిల్లర్ల వద్ద ఈ టెస్టులు చేయనున్నది. దీనికోసం పిల్లర్ల మధ్య 25 మీటర్ల లోతు నుంచి ఇసుక నమూనాలను సేకరిస్తున్నది. బుధవారం 12వ పిల్లర్ వద్ద 10 ఫీట్ల మేర బృందం సభ్యులు తవ్వారు. 13వ పిల్లర్ వద్ద పని పూర్తిచేసి మొదటి శాంపిల్ తీసుకున్నారు. ఈ బృందం వారం రోజుల పాటు ఇక్కడే ఉండి బ్యారేజీ మొత్తం పరిశీలించి రిపోర్ట్ ఇస్తుందని ఇరిగేషన్ ఇంజినీర్లు తెలిపారు.