సాగర్ కు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీమ్​

హాలియా, వెలుగు: నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సభ్యులు మంగళవారం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ డ్యాంను పరిశీలించారు. మూడు రోజుల పరిశీలనలో భాగంగా సీడబ్ల్యూసీ డైరెక్టర్ రమేశ్ కుమార్ ఆధ్వర్యంలోని ఎన్డీఎస్‌ఏ , కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఇరిగేషన్​డిపార్ట్​మెంట్లకు సంబంధించిన 13 మంది సోమవారం రాత్రి విజయవిహార్ అతిథి గృహానికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం ప్రాజెక్టుపైకి చేరుకుని డ్యామ్ గేట్లు, గ్యాలరీ, రోప్స్, కుడికాల్వ, హెడ్‌ రెగ్యులేటర్, జల విద్యుత్‌ కేంద్రం, క్రస్ట్​ గేట్లను, 220, 420 గ్యాలరీలను వాక్‌వే పై  నుంచి స్పిల్‌వేను పరిశీలించారు.

నాగార్జునసాగర్ ప్రాజెక్టును కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురానున్న నేపథ్యంలో డ్యాం భద్రత, నీటి నిల్వలు, వినియోగంపై అధ్యయనం చేసింది. 2009లో వచ్చిన వరదలకు ఎంత ఫ్లడ్​వచ్చింది. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో వివరాలను ఇరిగేషన్​శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. డ్యామ్ సూపర్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మల్లికార్జున్, తెలంగాణ, ఏపీ నీటిపారుల శాఖల అధికారులు, సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్, నాగార్జునసాగర్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, అసిస్టెంట్ కమాండెంట్, ఇరిగేషన్  అధికారులు ఉన్నారు.