వివక్ష, అసమానతలతో దేశాభివృద్ధి కుంటి నడకే!

రాజస్థాన్ లోని జాలోర్ జిల్లా సైలాలో ప్రైవేటు స్కూలులో చదువుతున్న ఓ దళిత విద్యార్థి కుండలో నీళ్లు తాగాడని చదువు నేర్పే టీచరే విద్యార్థిపై దాడి చేశాడన్న ఘటన దేశంలో కలకలం రేపింది. దాడికి గురైన ఆ విద్యార్థి చనిపోయాడు కూడా. అందరూ సమానమే అని బోధించాల్సిన బడిలోనే కుల వివక్ష ఘటన జరగడం75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో దుర్మార్గం. కుల పునాదుల మీద ఒక జాతిని గాని, నీతిని గానీ నిర్మించలేం అంటాడు డా.బాబా సాహెబ్ అంబేడ్కర్. ఏండ్లుగా వేళ్లూనుకున్న కులం సమాజ అభివృద్ధికి ఆటంకంగా మారుతోంది. ప్రపంచంలోనే అత్యధిక మానవ వనరులను కలిగి ఉన్నా, భారత్  ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉండటానికి ప్రధాన కారణం, ఆర్థిక అసమానతలు, దేశంలో 85 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలపై ఆధిపత్య కులాల అణచివేత.  రాజ్యాంగంలోని వివిధ ఆర్టికల్స్​సహా ఆదేశిక సూత్రాలు పిల్లలకు విద్యాపరమైన హక్కులు, రక్షణలు కల్పించాయి. కానీ వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్య వైఖరి కొనసాగుతోంది. అందుకే గ్లోబల్ కిడ్స్ రైట్స్ ఇండెక్స్ లో ఇండియా113వ ర్యాంక్ తో వెనుకబడి ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏండ్లు గడుస్తున్నా.. సమాజంలో ఇంకా అనేక రుగ్మతలు కొనసాగుతున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తి ఎక్కడా ప్రస్ఫుటించడం లేదు. భారత్​లో ఒక శాతం సంపన్నులు జాతీయ ఆదాయంలో 22 శాతం కలిగి ఉండగా, 50 శాతం పేదలు 13 శాతం మాత్రమే కలిగి ఉన్నారని వరల్డ్​ఇనిక్వాలిటీ రిపోర్టు 2022 అంచనా వేసింది. కరోనా మహమ్మారి కారణంగా దేశంలో  అనేకమంది పేద ప్రజలు అత్యంత పేదరికంలోకి నెట్టబడ్డారు. కొన్ని ఆధిపత్య వర్గాల వద్దే సంపద అంతా పోగుపడుతోంది. రాజ్యాంగంలోని సమానత్వ స్ఫూర్తి నానాటికీ కుచించుకుపోతోంది.

అభివృద్ధికి దూరంగా..

దేశంలో స్వాతంత్ర్యానికి ముందు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు భూమి, సంపద, జ్ఞానం, అధికారం, ఆత్మగౌరవం పెద్దగా ఉండేవి కావు. అడుగడుగునా అణచివేతతో మానవ హక్కుల ఉల్లంఘనలు ఉండేవి. ఏండ్ల పాటు వలసవాద పాలన తర్వాత చైతన్యం కలిగి స్వాతంత్ర్యం కోసం ఉద్యమం మొదలైంది. దేశంలో బ్రిటీష్ వారి నుంచి స్వాతంత్ర్యం వచ్చినా, ఆధిపత్య సామాజిక వర్గాలకు అధికార మార్పిడి జరిగినట్టుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అణగారిన వర్గాలకు లేని స్వాతంత్ర్యం నాకూ వద్దని జ్యోతిరావు ఫూలే  వ్యక్తి  స్వేచ్ఛ కోసం పోరాడారు. స్వతంత్ర భారతంలో పౌరుడు స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావ విలువలతో బతకడానికి రాజ్యాంగం రూపంలో అంబేద్కర్ హక్కులు సాధించిపెట్టాడు. కానీ సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో10 శాతం జనాభా కలిగిన ఆధిపత్య సామాజిక వర్గాలు పెత్తనం చెలాయిస్తూ, మిగతా 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలను కుల వ్యవస్థ అనే మూఢత్వంతో అభివృద్ధికి దూరం చేస్తున్నాయి. 

ప్రపంచంలో మనమెక్కడ?

దేశంలో బలహీనవర్గాలుగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు చట్టబద్ధంగా, రాజ్యాంగం ప్రకారం దక్కాల్సిన హక్కులు పాలకులు దక్కనీయడం లేదు. ప్రత్యేక చట్టాలు ఉన్నా వాటిని  సమర్థంగా అమలు చేయకపోవడంతో బడుగుల జీవితాల్లో మార్పు రావడం లేదు. అభివృద్ధికి వారు దూరంగానే ఉంటున్నారు. తద్వారా ఇతర దేశాలతో పోలిస్తే ఇండియా అభివృద్ధి కూడా వెనకబడే ఉంటోంది. వివిధ నివేదికల్లో ప్రపంచంలో భారతదేశ స్థానాన్ని చూస్తే ప్రపంచంలోనే అద్భుత రాజ్యాంగంగా పేర్కొనే భారత రాజ్యాంగం అమలు తీరు తెలుస్తుంది. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టులో ఇండియాది136 వ ర్యాంక్, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో150 వ ర్యాంక్,  గ్లోబల్ హాంగర్(ఆకలి) ఇండెక్స్ లో 101వ ర్యాంక్, హ్యూమన్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో 119 వ ర్యాంక్, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ లో 86 వ ర్యాంక్, హ్యూమన్ డెవలప్​మెంట్ ఇండెక్స్ లో 131 వ ర్యాంక్,  గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో 135 వ ర్యాంక్, గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ లో 71 వ ర్యాంక్ , డెమోక్రసీ రిపోర్ట్ లో 93వ ర్యాంకులో భారత దేశం ఉంది. కొన్ని రిపోర్టుల్లో చిన్న చిన్న, పేద దేశాల కంటే దారుణ స్థితిలో ఉండటం బాధాకరం. ప్రజలకు విద్య, వైద్యం,ఉపాధి అవకాశాలు కల్పించడంపై పాలకులు ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు. రాజ్యాంగ మూల సూత్రాలు, స్ఫూర్తికి గండికొడుతున్నారు. దేశంలో మెజార్టీ ప్రజలకు వారి హక్కులు వారికి తెలియవు. రాజ్యాంగం వారికి కల్పించిన ఉపశమనాల గురించి తెలియదు. రాజ్యాంగ ఉద్దేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మేధావులు, పౌరసమాజం, ప్రభుత్వంపై ఎంతైనా ఉంది.


- తాళ్ల అజయ్,
రీసెర్చ్ స్కాలర్, ఓయూ