జాతీయ విపత్తు నిర్వహణ విధి విధానాలు ఇవే..!

జాతీయ విపత్తు నిర్వహణ విధి విధానాలు ఇవే..!

జాతీయ విపత్తు నిర్వహణ చట్టం 2005, డిసెంబర్ 23 నుంచి అమలులోకి వచ్చింది. ఈ చట్టంలో భాగంగా ఆపత్సమయ నిర్వహణకు ప్రదాన మంత్రి అధ్యక్షుడిగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్​మెంట్ అథారిటీ(ఎన్ఎండీఏ)ను ఎనిమిదిమంది సభ్యులతో ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు ఉపాధ్యక్షుడిగా కేబినెట్ హోదాలోని మంత్రిని నియమిస్తారు. 

ఇందులోని సభ్యులు విపత్తులకు లోనయ్యే రాష్ట్రాల్లో పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తారు. విపత్తుల నిర్వహణలో అత్యంత నిపుణులైన వారి సలహాలు, సూచనలు తీసుకుంటారు. అత్యాధునిక సాంకేతికతతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఎలాంటి విపత్తులనైనా సమర్థవంతంగా ఎదుర్కోగల సంస్థాగత యంత్రాంగాన్ని రూపొందిస్తారు. 

జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ

జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థను తొలుత 2005, మే 30న ప్రధాన మంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. విపత్తు నిర్వహణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత చట్టంలోని సెక్షన్ 3(1) ప్రకారం ఎన్ డీఎంఏను 2006, సెప్టెంబర్ 27న ప్రధాన మంత్రి అధ్యక్షునిగా, మరో తొమ్మిది మంది సభ్యులతో లాంఛనంగా ఏర్పాటు చేశారు. సభ్యుల్లో ఒకరు వైస్ చైర్మన్​గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. 

జాతీయ కార్యనిర్వాహక కమిటీ

జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థకు విధుల నిర్వహణలో సహకరించేందుకు జాతీయ కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి చైర్మన్​గా వ్యవహరిస్తారు. దీంతోపాటు అన్ని మంత్రిత్వశాఖల కార్యదర్శులు సమావేశాల్లో ప్రత్యేక అతిథులుగా పాల్గొంటారు. డిజాస్టర్స్ పై విధివిధానాలు రూపొందించడం, ఎన్ డీఎంఏ నిర్వహణ, విడుదల చేసిన మార్గదర్శకాలు అమలయ్యేలా చూడటం ఈ సంస్థ ప్రధాన కర్తవ్యం. 

జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ

విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనే మానవ వనరులను తయారు చేయడానికి, సామర్థ్యం పెంపు, తగిన శిక్షణ ఇవ్వడం, పరిశోధన చేసి సరైన సమాచార నిధిని రూపొందించడం వంటి లక్ష్యాలతో 2003, అక్టోబర్ 16న ఎన్ఐడీఎంను ఏర్పాటు చేశారు. దీనికి కేంద్ర హోంమంత్రి అధ్యక్షుడిగా, ఎన్ డీఎంఏ ఉపాధ్యక్షుడు ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. 1995లో ఏర్పాటు చేసిన నేషనల్ సెంటర్ ఫర్ డిజాస్టర్ మేనేజ్ మెంట్(ఎన్ సీడీఎం) పేరును ఎన్ఐడీఎంగా మార్చారు. 

దేశంలో కేంద్ర మంత్రిత్వశాఖలు, అంతర్జాతీయ స్థాయిలో వివిధ కేంద్ర మంత్రిత్వశాఖలు, అంతర్జాతీయ స్థాయిలో వివిధ విపత్తులకు సంబంధించిన సంస్థల సమన్వయంతో విపత్తులను ఎదుర్కోవడానికి తగిన మార్గదర్శకాలను, నష్ట నివారణ చర్యలను రూపొందించడం, మానవ వనరులను తయారు చేయడం ఈ సంస్థ పని. 

జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి

విపత్తులకు గురైన వారికి తక్షణ సహాయం అందించడానికి జాతీయ స్థాయిలో ఇది వరకే రూ.500 కోట్లతో ఉన్న నేషనల్ కాలమిటీ కాంటింజెన్సీ ఫండ్ (2001లో ఏర్పాటైంది), కాలమిటీ రిలీఫ్​ఫండ్​ను 2010లో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ గా మార్చారు. 13వ ఆర్థిక సంఘం సూచన మేరకు ఈ రెండింటిని ఎన్ డీఆర్ఎఫ్​గా ఏర్పాటు చేశారు. కాలమిటీ రిలిఫ్​ఫండ్​ను రాష్ట్ర స్థాయిలో బాధితులకు తక్షణ సహాయం అందించడానికి 2000లో ఏర్పాటు చేశారు. 

2000–05 వరకు దాదాపు రూ.11,007 కోట్లు నిధులు అందజేశారు. ఇందులో కేంద్రం వాటా 75 శాతం, రాష్ట్ర వాటా 25 శాతం. విపత్తుల సమయంలో రాష్ట్రం బాధితులకు నిధులు అందించలేని స్థితిలో ఎన్ డీఆర్ఎఫ్ నుంచి నిధులు కోరవచ్చు. నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చేసిన సిఫారసుల మేరకు ఆయా రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తారు. గత ఐదారు సంవత్సరాల్లో రాష్ట్రాలకు విడుదల చేసిన నిధుల్లో కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బిహార్, రాజస్తాన్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, అసోం రాష్ట్రాలకే దాదాపు 86 శాతం నిధులు విడుదల చేశారు. వీటి కింది సునామీలు, భూకంపం, కరువు, వరదలు, అగ్ని ప్రమాదాల బాధితులకు తక్షణ ఉపశమనం, వెంటనే ఆవాసం, ఆహారం అందించడం వంటి కార్యక్రమాలు చేపడతారు.

రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ

రాష్ట్ర స్థాయిలో విపత్తు నిర్వహణ బాధ్యతను నిర్వర్తించడానికి రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు రాష్ట్ర ముఖ్యమంత్రి చైర్మన్​గా వ్యవహరిస్తారు. విపత్తు నిర్వహణకు కావాల్సిన విధివిధానాలను రూపొందించడం వీటి బాధ్యత. రాష్ట్రస్థాయిలో స్టేట్ ఎగ్జిక్యూటవ్ కమిటీ ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఇవి విపత్తుల సమయంలో త్వరితగతిన స్పందించడం, ఉపశమనం కలిగించడం, పునరావాసం కల్పించడం వంటి కార్యక్రమాలను భాగస్వాములను చేస్తూ విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తగిన ప్రణాళికలను రూపొందిస్తారు. 

జిల్లా విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ

రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో జిల్లా విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థను ఏర్పాటు చేశారు. కలెక్టర్ లేదా మేజిస్ట్రేట్ డీడీఎంఏకు అధ్యక్షుడిగా ఉంటారు. మార్గదర్శక సూత్రాల్లో సూచించిన విధంగా విపత్తు నిర్వహణ చర్యలను డీడీఎంఏ చేపడుతుంది. భద్రతా ప్రమాణాలను పటిష్టంగా అమలు చేయడం కోసం డీడీఎంఏకు ఆ జిల్లాలోని ఏ ప్రాంతంలోని నిర్మాణాలనైనా పరిశీలించే అధికారం ఉన్నది. విపత్తు నిర్వహణ సంస్థలకు మండల స్థాయిలో బ్లాక్ డెవలప్ మెంట్ ఆఫీసర్, గ్రామ స్థాయిలో సర్పంచ్ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.

జాతీయ విపత్తు ఉపశమన నిధి

విపత్తు నిర్వహణ చట్టం–2005లోని సెక్షన్ 47 జాతీయ ఉపశమన నిధి ఏర్పాటుకు వీలు కల్పించింది. ఇందుకు సంబంధించి చట్టంలో పలు నిబంధనలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్​లో నోటిఫికేషన్ ద్వారా ప్రత్యేకంగా ఉపశమన చర్యల కోసం ఉద్దేశించిన ప్రాజెక్టులకు జాతీయ విపత్తు ఉపశమన నిధిని ఏర్పాటు చేయవచ్చు.

 జాతీయ విపత్తు ఉపశమన నిధిని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ అమలు చేయాలి. జాతీయ విపత్తు ఉపశమన నిధి ఏర్పాటుకు సంబంధించి విధి విధానాలపై కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ఎప్పటికప్పుడు నీతి ఆయోగ్, జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థతో చర్చిస్తుంది. 13వ ఆర్థిక సంఘం తన నివేదికలతో ప్రత్యేకంగా ఎన్ డీఎంఎఫ్ కు సంబంధించి కొన్ని ఉపశమన సిఫారసులు చేసింది. 
1. ఉపశమన పునర్నిర్మాణ కార్యకలాపాలను ఆర్థిక సంఘం నిధుల ద్వారా అమలయ్యే పథకాలకు దూరంగా ఉండాలి.
2. దానికి బదులుగా కేంద్ర, రాష్ట్రాల అభివృద్ధి ప్రణాళికల నిధుల నుంచి వాటికి ఖర్చు చేయాలి అని పేర్కొన్నది. 

జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం

జాతీయ విపత్తు నిర్వహణ చట్టం–2005లోని సెక్షన్ 44 కింద జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాన్ని 2006లో ఏర్పాటు చేశారు. ప్రకృతి, మానవ తప్పిదాల వల్ల జరిగే వైపరీత్యాల్లో అతి శీఘ్రంగా స్పందించి సహాయ, పునరావాస కార్యక్రమాలను అందించేందుకు పూర్తిస్థాయి శిక్షణ కలిగిన వ్యక్తులు, అధునాతన యంత్ర పరికరాలతో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్​ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం కేంద్రం 8 పారా మిలటరీ దళాలను కేటాయించాలని నిర్దేశించింది. 

ఈ విపత్తు నిర్వహణ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి స్థానిక సంస్థల నుంచి దాదాపు 30 లక్షల మంది ప్రతినిధులు పాల్గొంటారు. వీరితోపాటు ఎన్​సీసీ, ఎన్​ఎస్ఎస్, హోంగార్డు బలగాలు, ఎన్​వైకేల నుంచి వలంటీర్లు విపత్తుల సమయంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. దేశంలో విభిన్న ప్రాంతాల విపత్తు సంభావ్యత ఆధారంగా ప్రత్యేక బెటాలియన్లను  ఏర్పాటు చేశారు. అవి..భటిండా(పంజాబ్), గౌహతి(అసోం), వడోదర(గుజరాత్), గ్రేటర్ నోయిడా(ఉత్తరప్రదేశ్), కోల్ కత్తా(పశ్చిమబెంగాల్), పుణె(మహారాష్ట్ర), విజయవాడ, అరక్కోణం(చెన్నై, తమిళనాడు), మండలి(భువనేశ్వర్, ఒడిశా), పాట్నా(బిహార్).