క్వీన్ ఎలిజబెత్ మరణానికి గౌరవసూచకంగా కేంద్ర ప్రభుత్వం నేడు సంతాప దినంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆమె గౌరవార్థం పలు రాష్ట్రాలు జాతీయ జెండాను అవనతం చేయనున్నాయి. అందులో భాగంగా హైదరాబాద్ లోని సంజీవయ్య పార్క్ లో జాతీయ పతాకాన్ని అవనతం చేశారు. కేవలం భారత్ లోనే కాదు.. 54 దేశాలలోనూ ఈ విధంగా దేశాలు తమ జాతీయ పతాకాన్ని అవనతం చేయనున్నాయి. బ్రిటన్ లో మాత్రం 10 నుంచి 12 రోజుల పాటు జాతీయ సంతాప దినాలుగా నిర్ణయించారు.
దాదాపు 70ఏళ్లు బ్రిటన్ ను ఏలిన క్వీన్ ఎలిజబెత్ II స్కాట్లాండ్ లో తుది శ్వాస విడిచారు. 96 ఏళ్ల క్వీన్ విక్టోరియా... మహారాణి మరణానంతరం ఆమె కుమారుడు చార్లెస్, బ్రిటన్‌తోపాటు 14 కామన్వెల్త్ దేశాలకు రాజుగా బాధ్యతలు చేపట్టారు. క్వీన్ చనిపోవడానికి రెండు రోజుల ముందు.. స్కాట్లాండ్‌లోని ప్యాలెస్‌లో లిజ్ ట్రస్‌ను కొత్త ప్రధానిగా నియమించారు. ఇక క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలను ఈ నెల 19న నిర్వహించనున్నట్లు బకింగ్ హామ్ ప్యాలెస్ వర్గాలు వెల్లడించాయి. రాణి పార్థీవ దేహాన్ని ప్రజలు సందర్శించుకునేందుకు వీలుగా 4 రోజుల పాటు వెస్ట్‌మినిస్టర్ హాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.