మావోయిస్టు ఇలాకాలో ఎగిరిన జాతీయ జెండా

మావోయిస్టు ఇలాకాలో ఎగిరిన జాతీయ జెండా
  • జాతీయ జెండా పట్టుకున్న మావోయిస్టు అగ్రనేత హిడ్మా తల్లి

భద్రాచలం, వెలుగు : ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని మావోయిస్టుల కంచుకోటగా పేర్కొనే దండకారణ్యంలో 76వ రిపబ్లిక్​ డే సందర్భంగా ఆదివారం త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. మావోయిస్టులు ఈ ప్రాంతంలో వేడుకలను నిరసిస్తూ నల్లజెండాలతో ర్యాలీని నిర్వహించే వారు. కానీ, ఈసారి ఆదివాసీలతో సీఆర్పీఎఫ్​ జవాన్లు వేడుకలు ఘనంగా నిర్వహించారు. 

గిరిజన పిల్లలతో జాతీయ జెండాలు పట్టించి గ్రామాల్లో ర్యాలీలు చేపట్టారు. మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మడివి హిడ్మా తల్లి కూడా బీజాపూర్​ జిల్లా కొండపల్లి బేస్  క్యాంపు వద్ద జాతీయ జెండా పట్టుకొని వేడుకల్లో పాల్గొనడం విశేషం. ఆదివాసీలకు అన్నదానం చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. బట్టలు అందజేశారు. జవాన్లు సైతం అబూజ్​మాఢ్​ పర్వత ప్రాంతాల్లో జాతీయ జెండాలను ఎగురవేసి అభివాదం చేశారు. భారత్​ మాతాకీ జై అంటూ నినాదాలతో దండకారణ్యం మారుమోగింది. అలాగే తెలంగాణ బార్డర్​లోని చర్ల మండలం సమీపంలో ఉన్న ఛత్తీస్​గఢ్​ రాష్ట్రం బీజాపూర్​ జిల్లా పామేడు నుంచి జిల్లా కేంద్రానికి బస్సు సర్వీసును ప్రారంభించారు. మారుమూల గ్రామాలను కలుపుకుంటూ ఈ బస్సు బీజాపూర్​కు చేరుకుంటుంది.