సిద్దిపేట టౌన్/దుబ్బాక, వెలుగు: దేశ సమైక్యత కోసం ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు మంగళవారం ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటాలని ఎమ్మెల్యే మాదవనేని రఘునందన్‌రావు పిలుపు నిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురష్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం దుబ్బాకలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంప్కార్యాలయం నుంచి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికే తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సిద్దిపేటలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు.
జిల్లా పార్టీ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ మీదుగా రూరల్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో బీజేపీ నాయకులు గంగాడి మోహన్ రెడ్డి , విద్యాసాగర్, రాంచంద్రరావు, పత్రి శ్రీనివాస్ యాదవ్, ఉపేందర్ రావు, ఉడుత మల్లేశం ,తొడుపునూరి వెంకటేశం వేణుగోపాల్,రాములు, కుమారస్వామి, నర్సింహారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పర్ష రాములు, బైరి శంకర్, రమేశ్ గౌడ్, అరుణ రెడ్డి పద్మ, లత, తదితరులు పాల్గొన్నారు.