స్కూల్​లో జెండా ఎగురవేయని టీచర్లు.. ఎంఈవోకు కంప్లయింట్​

  •    అనారోగ్య కారణాలతో రాలేకపోయిన హెచ్ఎం 
  •     ఛాతి నొప్పితో టీచర్​ అడ్మిట్​ 
  •     ఎంఈవోకు కంప్లయింట్​

నేరడిగొండ, వెలుగు : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని తేజపూర్ లోని ప్రైమరీ స్కూల్​లో ఇండిపెండెన్స్​డే సందర్భంగా మంగళవారం జాతీయ జెండా ఎగరవేయలేదు. హెచ్ఎంతో పాటు ఉన్న ఒక్క టీచర్​కూడా రాకపోవడంతో ఉత్సాహంతో స్కూలుకు వెళ్లిన విద్యార్థులు నిరుత్సాహంతో వెనుతిరిగారు. దీంతో తల్లిదండ్రులు హెచ్ఎంకు ఫోన్ చేయగా తాను అనారోగ్య కారణాలతో 30 రోజులు లీవ్​లో ఉన్నానని, అందుకే రాలేకపోయానని సమాధానమిచ్చారు. ఏఎంసీ చైర్మన్ కు సమాచారమిచ్చినా కార్యక్రమం జరిగేదని వారు మండిపడ్డారు. ఎంఈఓ పరిధిలోని ఎంఆర్సీ సిబ్బందితోనైనా జెండా ఎగురవేయాల్సిందన్నారు. మరో టీచర్​ఉన్నా అతడు రాకపోవడంపై ఫైర్​అయ్యారు. అయితే మంగళవారం తెల్లవారుజామున అతడు ఛాతినొప్పితో హాస్పిటల్​లో జాయిన్​అయ్యాడని తెలిసింది. దీంతో ఎవరూ రాలేని పరిస్థితి ఏర్పడింది. చివరకు ఎంఈఓ భూమారెడ్డికి ఏఎంసీ చైర్మన్​ఫిర్యాదు చేయడంతో ఇంటికి వెళ్లిన పిల్లలను హైస్కూల్ కు తీసుకువచ్చి జెండా వందనం చేయించారు. జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.