
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను రాజ్యాంగంలోని ఆర్టికల్స్21(జీవించే హక్కు), 48ఏ కింద నేషనల్ ట్రిబ్యునల్ చట్టం–2010 ప్రకారం ఏర్పాటైంది. దీని ఏర్పాటుతో భారత్ ప్రపంచంలో పర్యావరణం కోసం ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తర్వాత మూడో స్థానాన్ని ఆక్రమించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు మూలం ధరిత్రీ సదస్సు(రియోడీ జెనిరో – బ్రెజిల్–1992). పర్యావరణ సంబంధిత కేసులను సమర్థవంతంగా పరిష్కరించడం, ఆస్తులు, వ్యక్తి సంబంధిత నష్టాలకు పరిహారం ఇవ్వడం లక్ష్యాలుగా పనిచేస్తుంది.
నిర్మాణం
- చైర్మన్: కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి ఈ ట్రిబ్యునల్‌కు ఒక చైర్మన్‌ను నియమిస్తుంది.
- సభ్యులు: 1. జ్యుడీషియల్ సభ్యులు – 10 మందికి తగ్గకుండా, 20 మందికి మించకుండా ఉంటారు.
- 2. నిష్ణాతులైన సభ్యులు 10 మందికి తగ్గకుండా, 20 మందికి మించకుండా ఉంటారు. జ్యుడీషియల్ మెంబర్స్, నిష్ణాతులైన సభ్యుల ఎంపికకు కేంద్ర ప్రభుత్వం ఒక నియామక కమిటీని ఏర్పాటు చేస్తుంది.
పదవీకాలం
- చైర్మన్, సభ్యుల పదవీకాలం 5 సంవత్సరాలు. వీరు పునర్నియామకానికి అనర్హులు.
- సుప్రీంకోర్టు న్యాయమూర్తి చైర్మన్‌గా గానీ లేదా జ్యుడీషియల్ సభ్యుడిగా గానీ నియామకమైతే అతడి పదవీ విరమణ వయస్సు – 70 ఏండ్లు.
- హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చైర్మన్‌గా గానీ లేదా జ్యుడీషియల్ సభ్యుడిగా గానీ నియామకమైతే అతడి పదవీ విరమణ వయస్సు 67 ఏండ్లు.
- నిష్ణాతులైన సభ్యుల పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలు.
-
తొలగింపు, రాజీనామా
- అవినీతి, అసమర్థత, దివాళా తీయడం, నేరారోపణ రుజువుకావడం వంటి కారణాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహా మేరకు చైర్మన్, జ్యుడీషియల్ సభ్యులను వారి పదవి నుంచి తొలగిస్తుంది.
- అవినీతి, అసమర్థత, దివాళా తీయడం, నేరారోపణ రుజువు కావడం వంటి కారణాల ఆధారంగా నిష్ణాతులైన సభ్యులను కేంద్ర ప్రభుత్వం తాను నిర్దేశించిన పద్ధతి ప్రకారం ఒక ఉత్తర్వు ద్వారా వారిని పదవి నుంచి తొలగిస్తుంది.
- చైర్మన్, సభ్యులు రాజీనామాను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తారు.
-
విచారణ పరిధి, అధికారాలు
- పర్యావరణ సంబంధ వివాదాలు గల అన్ని సివిల్ కేసులను ఈ ట్రిబ్యునల్ విచారిస్తుంది.
- ఇది అప్పీల్ విచారణ పరిధి కలిగి ఉంది.
- సివిల్ ప్రొసీజర్ కోడ్ (1908)లో పేర్కొన్న పద్ధతులకు ట్రిబ్యునల్ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. ఈ ట్రిబ్యునల్ సహజ న్యాయసూత్రాల ఆధారంగా పనిచేస్తుంది.
- ఈ ట్రిబ్యునల్ తీర్పులపై 90 రోజుల్లో సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది.
- ఇది సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా వ్యవహరిస్తుంది. ఈ ట్రిబ్యునల్ ఆరు నెలల్లోగా కేసులను పరిష్కరిస్తుంది.
- దీని కేంద్రం ఢిల్లీ. జోనల్ బెంచ్‌లు భోపాల్(సెంట్రల్), పుణె(పశ్చిమ), కోల్ కతా(తూర్పు), చెన్నై(దక్షిణం)లో ఉన్నాయి.