మానేరు రివర్ ఫ్రంట్ పనులపై స్టే కొనసాగింపు

మానేరు రివర్ ఫ్రంట్ పనులపై స్టే కొనసాగింపు
  • ఉత్తర్వులు జారీ చేసిన ఎన్జీటీ

కరీంనగర్, వెలుగు: తాము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చే వరకు మానేరు రివర్‌‌ ఫ్రంట్‌‌ పనులు చేపట్టొద్దని, గతంలో ఇచ్చిన స్టేను కొనసాగిస్తున్నట్లు నేషనన్‌‌ గ్రీన్‌‌ ట్రిబ్యునల్‌‌ (ఎన్జీటీ) ఉత్తర్వులిచ్చింది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఆఫీసర్లు ఇప్పటి వరకు రిపోర్టులు సమర్పించనందున కేసు విచారణను డిసెంబర్‌‌ 2కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాక ఈ కేసులో ఆరో ప్రతివాదిగా ఇరిగేషన్ శాఖను కూడా చేర్చాలని పేర్కొంది. కరీంనగర్ కు పర్యాటక శోభను తీసుకొచ్చేందుకు మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును గత సర్కార్ హయాంలో ప్రారంభించిన విషయం తెలిసిందే.

అయితే మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణానికి పర్యావరణ అనుమతుల్లేవని ఎం.వెంకటరెడ్డి అనే వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. దీంతో స్పందించిన ఎన్జీటీ చెన్నై బెంచ్ రాష్ట్ర టూరిజం, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖలకు గతంలో నోటీసులు జారీ చేసింది. దీంతో భాగంగా తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఈ నెల 4న ఎన్జీటీకి రిపోర్టు సమర్పించింది. మానేరు రివర్ ఫ్రంట్ మాస్టర్ ప్లాన్ ప్రకారం 4 జోన్లుగా విభజించామని, రూ.100 కోట్లతో వ్యూయింగ్ గ్యాలరీ, ఎంట్రీ ప్లాజా, మ్యూజికల్ ఫౌంటెన్ అభివృద్ధి చేయాలని, రామగుండం హైదరాబాద్ బైపాస్ రోడ్డు నుంచి బండ్ వరకూ ఫార్మేషన్ రోడ్డు, ల్యాండ్ స్కేపింగ్, ఇల్యూమినేషన్, పాత్ వేలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. 

అయితే ఈ పనుల డిజైన్లు సరిగ్గా రాకపోవడంతోపాటు ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతులు రాకపోవడంతో 2023 జూన్ నుంచి ఈ పనులకు నిలిపివేయాల్సి వచ్చిందని వెల్లడించారు. దీంతో టూరిజం ఆఫీసర్ల నివేదిక ఆధారంగా తెలంగాణ ఇరిగేషన్ అధికారులను కూడా ప్రతివాదిగా చేర్చాలని సుమోటోగా నిర్ణయించినట్లు ఎన్జీటీ బెంచ్ వెల్లడించింది.