నేషనల్ హెరాల్డ్​ను ఏటీఎంలా వాడుకున్నరు: రవిశంకర్ ప్రసాద్

నేషనల్ హెరాల్డ్​ను ఏటీఎంలా వాడుకున్నరు: రవిశంకర్ ప్రసాద్

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ పత్రికను గాంధీ కుటుంబం ప్రైవేటు ఏటీఎంలా వాడుకుందని బీజేపీ సీనియర్ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో ప్రజల గొంతును వినిపించేందుకు ఏర్పాటు చేసిన పత్రికను ప్రైవేట్ వ్యాపారంగా మార్చారని ఆయన దుయ్యబట్టారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక మనీలాండరింగ్ కేసులో  సోనియా, రాహుల్ గాంధీతో పాటు మరికొందరిపై ఈడీ బుధవారం చార్జ్​షీట్​ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్​ నేతలు దేశవ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ముందు నిరసన వ్యక్తం చేశారు.  దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. 

బుధవారం ఢిల్లీలోని ఆ పార్టీ హెడ్​ఆఫీసులో రవిశంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. “కాంగ్రెస్ పార్టీకి నిరసన తెలిపే హక్కు ఉంది. కానీ, ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేసి నేషనల్ హెరాల్డ్‌‌కు ఇచ్చే హక్కు మాత్రం లేదు” అని ఆయన అన్నారు. ఢిల్లీలోని బహదూర్ షా జాఫర్ మార్గ్ నుంచి ముంబై, లక్నో, భోపాల్, పాట్నా వరకు దేశవ్యాప్తంగా ఉన్న విలువైన ప్రభుత్వ ఆస్తులను యంగ్ ఇండియా లిమిటెడ్ ద్వారా గాంధీ కుటుంబానికి బదిలీ చేయడానికి కార్పొరేట్ కుట్రకు పాల్పడ్డారని అన్నారు. "రాహుల్ గాంధీ, సోనియా గాంధీ బెయిల్‌‌పై బయట ఉన్నారని మర్చిపోవద్దు. కేసును కొట్టివేయాలని వారు సుప్రీంకోర్టు దాకా వెళ్లి విఫలమయ్యారు. చట్టం తన పని తాను చేసుకోవడానికి మనం అనుమతించాలా వద్దా?" అని ఆయన ప్రశ్నించారు.