
- ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు
- కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ చీఫ్ శామ్ పిట్రోడా,
- సుమన్ దూబే పేర్లు కూడా చేర్చిన దర్యాప్తు సంస్థ
- ఈ నెల 25న విచారించనున్న స్పెషల్ కోర్టు
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాజాగా చార్జ్‌షీట్ దాఖలు చేసింది. అందులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ పేర్లను చేర్చింది. వీరితోపాటు ఆ పార్టీ ఓవర్సీస్ యూనిట్ చీఫ్ శామ్ పిట్రోడా, సుమన్ దూబేను నిందితులుగా పేర్కొంటూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో చార్జ్‌షీట్ వేసింది.
ఏప్రిల్ 9న దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే మంగళవారం పరిశీలించి, తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు. కాగా, ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై చార్జిషీట్ దాఖలు చేయడం ఇదే మొదటిసారి. దీనిపై అటు కాంగ్రెస్‌కానీ.. ఇటు గాంధీ కుటుంబం కానీ ఇప్పటివరకూ స్పందించలేదు.
నేషనల్ హెరాల్డ్ వివాదం ఏంటి?
స్వాతంత్ర్యోద్యమ కాలంలో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఇండియన్లగొంతు వినిపించేందుకు 1938లో అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జవహర్‌లాల్ నెహ్రూ ‘నేషనల్ హెరాల్డ్’ పత్రికను ప్రారంభించారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్) సంస్థ ఆధ్వర్యంలో ఈ పత్రిక నడిచేది. ఇందులో 5వేల మంది స్వాతంత్ర్య సమరయోధులు భాగస్వాములుగా ఉండేవారు. నెహ్రూ ప్రధాన దాతగా వ్యవహరించారు. 2008లో నేషనల్ హెరాల్డ్ పత్రిక మూతపడే నాటికి రూ.90.25 కోట్ల మేర కాంగ్రెస్ పార్టీకి ఆ సంస్థ బకాయిపడింది. ఇది వడ్డీలేని రుణం.
2009లో వరుసగా రెండో సారి యూపీఏ అధికారంలోకి వచ్చాక 2010లో లాభాపేక్షలేని దాతృసంస్థగా యంగ్ ఇండియన్ లిమిటెడ్ (వైఐఎల్) ఆవిర్భవించింది. నేషనల్ హెరాల్డ్, ఏజేఎల్ అప్పులు, ఆస్తులన్నీ వైఐఎల్‌కు దఖలుపడిన తర్వాత ఈ మొత్తం వ్యవహారం కీలక మలుపులు తిరిగింది. నేషనల్ హెరాల్డ్ విషయంలో భారీ కుంభకోణం జరిగిందని, సోనియా, రాహుల్ గాంధీ తదితరులకు దీనిలో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ రాజకీయ నాయకుడు, న్యాయవాది సుబ్రమణ్య స్వామి 2012లో ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రాబర్ట్ వాద్రాను విచారించిన కొన్ని గంటల్లోనే..
హర్యానాలో ఓ ల్యాండ్ డీల్ లో మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై రాబర్ట్ వాద్రాను ఈడీ ప్రశ్నించిన కొన్ని గంటల్లోనే ఈ చార్జిషీట్స్ దాఖలయ్యాయి. కాగా, నేషనల్హెరాల్డ్ ఆస్తుల వ్యవహారంలో మనీలాండరింగ్జరిగిందంటూ 2014 జూన్ 26న బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. దీన్ని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ పరిగణనలోకి తీసుకున్న తర్వాత 2021లో ఈడీ దర్యాప్తు ప్రారంభమైంది.
సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ మొదటి కుటుంబం, ఆమె కుమారుడు రాహుల్, దివంగత కాంగ్రెస్ నాయకులు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్‌తో పాటు సుమన్ దూబే, పిట్రోడా, ప్రైవేట్ కంపెనీ యంగ్ ఇండియన్ సహా అనేక మంది ప్రముఖ రాజకీయ ప్రముఖులకు ఈ వ్యవహారంతో సంబంధం ఉందని ఈడీ అభియోగాలు నమోదుచేసింది. ఈ కేసులో ఇప్పటికే సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను ఈడీ విచారించి, స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది.
కాగా, గత శనివారం అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆయా ఆస్తుల్లో ఉన్న వారు ఖాళీ చేయాలని, అద్దెకు ఉంటున్న వారు ఇక నుంచి తమకే ఆ మొత్తాన్ని చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
ఇయ్యాల దేశమంతటా కాంగ్రెస్ నిరసనలు
న్యూఢిల్లీ: బీజేపీ అణచివేత రాజకీయాలకు, ఈడీ ధోరణికి నిరసనగా బుధవారం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఈడీ ఆఫీసులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసన చేపట్టాలని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇది ప్రజాస్వామ్య పరిరక్షణకు, రాజ్యాంగ విలువలను నిలబెట్టేందుకు ఐకమత్యంతో ధైర్యంగా పోరాడాల్సిన సమయమని వేణుగోపాల్ పేర్కొన్నారు.