![హైవేకు భూములియ్యం..నేషనల్ హైవే ఆఫీసర్ల ఎదుట రైతుల నిరసన](https://static.v6velugu.com/uploads/2025/02/land-will-not-be-given-for-four-lanefarmers-protest-before-national-highway-officers_SqMmH5zroW.jpg)
- భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులు
కోల్ బెల్ట్, వెలుగు : నేషనల్ హైవే–63 ఫోర్‌లేన్ నిర్మాణానికి తమ భూములు ఇవ్వబోమని రైతులు తేల్చిచెప్పారు. మంగళవారం క్యాతనపల్లి మున్సిపాలిటీలోని తిమ్మాపూర్ గ్రామ శివారులో హైవే బైపాస్ ప్రతిపాదిత స్థల పరిశీలనకు వచ్చిన హైవే ఆఫీసర్ల ఎదుట నిరసన తెలిపారు. ఫోర్‌లేన్ లో భాగంగా వేంపల్లి నుంచి కుర్మపల్లి వరకు 10 కిలోమీటర్ల మేర బైపాస్‌ను నిర్మించి మంచిర్యాల–చాందాహైవేకు అనుసంధానం చేయనున్నారు.
ఈ నేపథ్యంలో నిర్వాసితుల డిమాండ్లు, సమస్యలు తెలుసుకునేందుకు ఢిల్లీకి చెందిన సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎక్స్పర్ట్ ఆనంద్ బాబు, నేషనల్ హైవే సైట్ ఇంజనీర్ బి.సంతోష్ తదితరులు నిర్వాసితులతో చర్చించారు. తాము ఎట్టి పరిస్థితుల్లో హైవేకు భూములు ఇవ్వమని కొందరు నిర్వాసితులు తేల్చిచెప్పారు.
భూములు గుంజుకోవద్దు..
ఏండ్ల కింద అప్పు చేసి కొనుక్కున్న భూములను హైవేకు ఇవ్వబోమని భూ యజమానులు తెలిపారు. 8 నెలలుగా నోటీసులు పంపించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముల్కల్ల నుంచి కుర్మపల్లి వరకు కొంత మంది బడా వ్యక్తుల భూములను కాపాడేందుకే మూడు సార్లు అలైన్మెంట్ మార్చారని మండిపడ్డారు.
ప్రస్తుత భూమి ఓనర్లను పిలవకుండా, గతంలో అమ్మిన వ్యక్తులు, దళారులను పిలిచి భూముల్లో సర్వే చేసి నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ఇప్పుడున్న మార్కెట్ రేట్ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని, నిజమైన నిర్వాసితులను గుర్తిస్తే సహకరిస్తామని మరి కొందరు పేర్కొన్నారు.