
- పట్టణాలు, గ్రామాల వద్దే ఫోర్ లేన్, డివైడర్
- మిగితా అంతా టూలేన్ రోడ్డు
- తరచూ రోడ్డు ప్రమాదాలు 4 నెలల్లో 15 మంది మృతి
మెదక్/ కౌడిపల్లి, వెలుగు: నేషనల్ హైవే 675 డీ డేంజర్ గా మారింది. పట్టణాలు, గ్రామాల దగ్గర తప్ప మిగితా అంతా టూ లేన్ రోడ్డే ఉండటం, ఫారెస్ట్ఏరియాలో మలుపులు ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రోడ్డు బాగుండడంతో వెహికల్స్ స్పీడ్ ఎక్కువగా ఉండడం, మధ్యలో డివైడర్ లేక పోవడం వల్ల చాలాసార్లు వాహనాలు ఎదురెదురుగా ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయి.
విస్తరణకు ‘ఫారెస్ట్’ అడ్డు
హైద్రాబాద్ బాలానగర్ నుంచి నర్సాపూర్ మీదుగా మెదక్ పట్టణానికి ఇదివరకు సింగిల్ రోడ్డే ఉండేది. ఈ రూట్లో వాహనాల సంఖ్య పెరగడంతో స్టేట్హైవేగా ఉన్న ఈ రోడ్డును 2017 –-18 లో నేషనల్ హైవే గా మార్చారు. బాలానగర్, మెదక్మధ్య హైవే కోసం రూ.320 కోట్లు మంజూరుకాగా.. నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో 2021నాటికి నిర్మాణం పూర్తయింది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల, మెదక్ జిల్లాలోని నర్సాపూర్ టౌన్, వెంకట్రావ్ పేట, కౌడిపల్లి, కొల్చారం, అప్పాజిపల్లి, పోతంశెట్టి పల్లి, మంబోజిపల్లి గ్రామాల వద్ద కొంత దూరం మాత్రమే 4 లేన్ రోడ్డుగా విస్తరించి, డివైడర్ ఏర్పాటు చేశారు. పారెస్ట్ క్లియరెన్స్ రాకపోవడంతో గుమ్మడిదల, నర్సాపూర్మధ్య 14 కిలోమీటర్ల దూరం టూలేన్ రోడ్డు మాత్రమే నిర్మించారు. ఇక్కడ మూలమలుపులు ఎక్కువగా ఉండడం, ఫారెస్ట్ అనుమతుల్లేక వాటిని అలాగే వదిలేయడంవల్ల సమస్యలు వస్తున్నాయి.
మూలమలుపులతో ముప్పు
డివైడర్లు లేని చోట్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. నర్సాపూర్ మండలం చిన్న చింతకుంట, పెద్ద చింతకుంట గేట్ల దగ్గర, కౌడిపల్లి మండలం తునికి గేట్, రాయిలాపూర్, నాగ్సాన్పల్లి, అంతారం గేట్, మహ్మద్ నగర్ గేట్, కొల్చారం మండలంలోని లోతు వాగు దగ్గర, జైన్ మందిర్ మూలమలుపువద్ద, కిష్టాపూర్ గేట్, రాంపూర్ గ్రామాల దగ్గర తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. నర్సాపూర్, గుమ్మడిదల మధ్య మూల మలుపులు డేంజర్ స్పాట్లుగా మారాయి. గత 4 నెలల్లోనే ఈ రూట్లో జరిగిన ప్రమాదాల్లో15 మంది చనిపోయారు. ఈ వారం రోజుల్లోనే రెండు ప్రమాదాలు జరగ్గా ఆరుగురు చనిపోయారు.
ఈ నెల 20న కౌడిపల్లి మండలం రాయిలాపూర్, - వెంకట్రావ్ పేట మధ్య రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. 26న నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంట వద్ద రెండు బైక్ లు, లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఏటా దాదాపు 50 మంది వరకు ప్రమాదాల్లో చనిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. హైవేపై ప్రమాదాల నివారణకోసం పోలీసు శాఖ చర్యలు తీసుకుంటోంది. ఎస్పీ ఉదయ్ కుమార్రెడ్డి చొరవ తీసుకుని మూల మలుపులు ఉన్న చోట రబ్బర్ బోల్డార్స్ ఏర్పాటు చేయించారు. అక్కడ ప్రమాదాలు తగ్గినప్పటికీ డివైడర్ లేని మిగతా ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగుతూనేఉన్నాయి. మలుపులు సవరించి రోడ్డును మరింతగా విస్తరించడం, డివైడర్ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలు నివారించాలని స్థానికులు అంటున్నారు.