హైవే పనులకు అడ్డంకులు.. పలుచోట్ల అభ్యంతరాలతో నిలిచిన నేషనల్ హైవే 765డీజీ పనులు

హైవే పనులకు అడ్డంకులు.. పలుచోట్ల అభ్యంతరాలతో నిలిచిన నేషనల్ హైవే 765డీజీ పనులు
  • గత నెలలోనే ముగిసిన గడువు
  • ఇప్పటివరకు 65 శాతం పనులే పూర్తి
  • ఎక్స్​టెన్షన్​ కోసం ఆఫీసర్ల ప్రయత్నాలు

సిద్దిపేట/మెదక్, వెలుగు: మెదక్ నుంచి సిద్దిపేట వరకు జరుగుతున్న నేషనల్ హైవే (765డీజీ) ఫస్ట్ ప్యాకేజీ  పనులు స్లోగా సాగుతున్నాయి. జనవరి 31తో గడువు ముగిసినా ఇప్పటికి వరకు  65 శాతం పనులు మాత్రమే జరిగాయి. మెదక్ నుంచి ఎల్కతుర్తి వరకు మొత్తం 133 కిలో మీటర్ల హైవే నిర్మాణానికి కేంద్రం రూ.1461 కోట్లు మంజూరు చేసి రెండు ప్యాకేజీలుగా విభజించింది. రెండేళ్లలో పూర్తి చేసే విధంగా 2023లో  పనులు ప్రారంభమయ్యాయి. 

మెదక్ నుంచి సిద్దిపేట వరకు 65 కిలోమీటర్లను ఫస్ట్ ప్యాకేజీ కింద విభజించి రూ.882 కోట్లను కేటాయించి పనులు ప్రారంభించారు. రెండేళ్లలో పూర్తికావాల్సిన పనులు సిద్దిపేట, మెదక్​జిల్లాల్లో పలు అభ్యంతరాల కారణంగా ఆగిపోయాయి. నిర్మాణ పనుల గడువు ముగియడంతో మరో ఏడాది ఎక్స్​టెన్షన్​కోసం నేషనల్ హైవే అధికారులు ప్రయత్నిస్తున్నారు. 

సిద్దిపేటలో రెండు చోట్ల నిలిచిన పనులు

నేషనల్ హైవే 765 డీజీ పనులకు సంబంధించి సిద్దిపేట జిల్లాలో రెండు చోట్ల  పనులు నిలిచిపోయాయి. పట్టణ శివార్లలోని రంగథాంపల్లి వద్ద రాజీవ్ రహదారిని క్రాస్  చేసేందుకు ముందుగా అండర్ పాస్ ను నిర్మించాలని అనుకున్నారు. కానీ దీనిపై అభ్యంతరాలు రావడంతో ఫ్లై ఓవర్ నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఒకవైపు రైల్వే ఫ్లై ఓవర్ మరోవైపు రాజీవ్ రహదారిపై మరో ఫ్లై ఓవర్ నిర్మించడం వల్ల తమకు నష్టం వాటిల్లుతుందని రంగథాంపల్లి వాసులు ఆందోళనకు దిగారు. 

స్థానికులు ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ కరీంగనర్  రాజీవ్ రహదారి వైపు ఫ్లై ఓవర్ నిర్మించి రంగథాంపల్లి చౌరస్తా వద్ద పాత రోడ్డునే కొనసాగించాలనే డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు. సిద్దిపేట బైపాస్ రోడ్డులోని ఎన్సాన్ పల్లి చౌరస్తా వద్ద స్థానికుల అభ్యంతరాల నేపథ్యంలో ఫ్లై ఓవర్ కోసం కొంత మేర నిర్మాణం జరిపి వదిలిపెట్టారు. పట్టణంలోని బీజేఆర్ చౌరస్తా వద్ద హైవే పనుల విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. 

మెదక్ జిల్లాలో మూడు చోట్ల అభ్యంతరాలు

మెదక్ జిల్లాలో హైవే నిర్మాణంలో మూడు చోట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రామాయంపేట పట్టణ పరిధిలో బై పాస్ రోడ్డు నిర్మించేలా నేషనల్ హైవే అథారిటీ అధికారులు ప్లాన్ చేశారు. 2.65 కిలో మీటర్లు బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం 33.20 ఎకరాల భూమి సేకరిస్తుండడంతో  పలువురు రైతుల సాగు భూములతో పాటు, ఇండ్ల నిర్మాణానికి సంబంధించి 600 ప్లాట్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు హైవే కు సంబంధించిన బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. 

గతంలో హైదరాబాద్ -నాగపూర్ హైవే విస్తరణ సమయంలో పెద్ద ఎత్తున భూములు కోల్పోయామని, మళ్లీ ఇప్పుడు మరో హైవేకు భూములు తీసుకుంటే తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ - రామాయంపేట మధ్యలో శమ్నపూర్, గంగాపూర్, లక్ష్మాపూర్, తొనిగండ్ల, అక్కన్నపేట పరిధిలో హైవే విస్తరణ కోసం ఇరువైపులా అటవీ భూమి సేకరించాల్సి ఉంది. 

ఇందుకు సంబంధించి అటవీ శాఖ నుంచి పర్మిషన్ రాకపోవడం వల్ల ఆ ప్రాంతంలో పనులు జరగడం లేదు. మెదక్ పట్టణంలోనీ తారకరామ నగర్ కాలనీ వద్ద  ఆలయాలు ఉండడం వల్ల హైవే నిర్మాణానికి ఆటంకాలు ఎదురయ్యాయి. దీంతో ఇక్కడ ఒక వైపున మాత్రమే రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు.

ఫ్లై ఓవర్ నిర్మాణంతో ఉపాధి కరవు: మల్లయ్య, రంగాధాంపల్లి 

రంగథాంపల్లి చౌరస్తా వద్ద  ఫ్లై ఓవర్ నిర్మిస్తే నాలాంటి పేదలకు  ఉపాధి కరువవుతుంది. ఫ్లై ఓవర్ వల్ల చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వారికి వ్యాపారం నడిచే పరిస్థితి ఉండదు.  బొగ్గులోని బండ వద్ద ఉన్న రైల్వే లైన్ కోసం  ఎకరం పొలాన్ని  ప్రభుత్వం రైల్వే లైన్ నిర్మాణానికి తీసుకుంది. పరిహారం డబ్బులతో  కిరాణా షాపు నడుపుకుంటున్నా. ఇప్పుడు ఫ్లైఓవర్ నిర్మిస్తే దీన్ని కోల్పోవాల్సి వస్తుంది. ప్రభుత్వం రాజీవ్ రహదారిపై  ఫ్లైఓవర్ నిర్మిస్తే ఎవరికీ నష్టం ఉండదు. 

ఎక్స్​టెన్షన్​కు ప్రయత్నాలు: అన్నయ్య, డీఈఈ నేషనల్​ హైవే

మెదక్  నుంచి సిద్దిపేట వరకు నేషనల్ హైవే (765 డీజీ) పనులను స్పీడ్​గా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కొన్ని ఇబ్బందుల వల్ల ఇప్పటివరకు 65 శాతం పనులను పూర్తి చేశాం. గడువు ముగిసినందున మిగిలిన పనులను పూర్తి చేసేందుకు ఎక్స్​టెన్షన్​కోసం ప్రయత్నిస్తున్నాం. రంగథాంపల్లి, ఎన్సాన్ పల్లి చౌరస్తా ల వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణాలు ఉన్నతాధికారుల సూచన మేరకే జరుగుతాయి. కేంద్రం నుంచి అనుమతులు లభిస్తేనే అటవీ ప్రాంతంలో పనులను ప్రారంభిస్తాం.