![గుట్టలు చీలుస్తూ.. మలుపులు సవరిస్తూ](https://static.v6velugu.com/uploads/2025/02/national-highway-construction-underway-from-medak-to-yellareddy-travel-time-to-be-reduced_7vDVPFwap0.jpg)
- మెదక్-ఎల్లారెడ్డి మధ్య నేషనల్ హైవే నిర్మాణం
- తగ్గనున్న ప్రయాణ సమయం
- వాహనదారులకు తప్పనున్న తిప్పలు
మెదక్, వెలుగు: మెదక్ పట్టణం నుంచి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి వరకు చేపడుతున్న నేషనల్ హైవే నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ రూట్లో ఆయా చోట్ల ప్రస్తుతం ఉన్న మలుపులను సవరిస్తూ.. గుట్టలను చీలుస్తూ హైవే నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ పనులు పూర్తయితే హైదరాబాద్ --బోధన్ రూట్లో రాకపోకలు సాగించే వారికి సమయం అదా అవుతుంది. గతంలోనే హైదరాబాద్ శివారు బాలానగర్ నుంచి మెదక్ మీదుగా నిర్మల్ జిల్లా భైంసా వరకు ఉన్న స్టేట్ హైవేను నేషనల్ హైవేగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
దీనిని మూడు పార్ట్ లుగా చేపట్టాలని నిర్ణయించారు. మొదటి దశలో బాలానగర్ నుంచి మెదక్ వరకు 62 కిలో మీటర్ల దూరం నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం పూర్తయింది. రెండో దశలో మెదక్ నుంచి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి వరకు 44 కిలో మీటర్ల దూరం హైవే రోడ్డు నిర్మాణం కోసం రూ.399 కోట్లు మంజూరు కాగా పనులు జరుగుతున్నాయి. ఇదివరకు స్టేట్ హైవే గా ఉన్న ఈ రూట్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. నిజామాబాద్, బోధన్, బాన్సువాడ, కామారెడ్డి, మెదక్ ఆర్టీసీ డిపోల బస్సులతో పాటు, వివిధ రాష్ట్రాలలోని కంపెనీలకు ముడి సరుకులు, ఉత్పత్తులు ట్రాన్స్పోర్టు చేసే కంటైనర్లు, ట్యాంకర్లు, లారీలు రాకపోకలు సాగిస్తాయి. రోడ్డు వాహనాల రద్దీకి అనుగుణంగా లేకపోవడం, ముఖ్యంగా అనేక చోట్ల మలుపులు ఉండడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతూ ఎంతో మంది చనిపోతున్నారు.
ఈ క్రమంలో హైవే మంజూరు కాగా సాధ్యమైనంత వరకు మలుపులు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. హవేలీ ఘనపూర్ మండల పరిధి నాగపూర్ గేట్ వద్ద రోడ్డు వంకలు తిరిగి ఉండగా అక్కడ ప్రస్తుతం ఉన్న రూట్లో కాకుండా పక్క నుంచి హైవే నిర్మాణం చేపడుతున్నారు. అలాగే జిల్లా సరిహద్దు గ్రామమైన పోచమ్మ రాల్ వద్ద మలుపుతో పాటు, తండా మధ్య నుంచి రోడ్డు ఉండగా ఇండ్లను తొలగించాల్సిన అవసరం లేకుండా తండా పక్కన ఉన్న గుట్టను చీల్చి హైవే నిర్మాణ పనులు చేస్తున్నారు.
చాల వరకు మలుపులు తగ్గి పోతుండడంతో మెదక్ నుంచి ఎల్లారెడ్డి వరకు వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాగించొచ్చు. ఇదిలా ఉండగా హవేలీ ఘనపూర్ మండలం రాయిన్ చెరువు శివారు నుంచి జిల్లా సరిహద్దులో ఉన్న పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ వరకు అటవీ ప్రాంతం ఉండడంతో అక్కడ పర్మిషన్ రాక పోవడంతో ఇంకా హైవే నిర్మాణ పనులు జరగడం లేదు.