- రోడ్డు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ఏర్పాటుకు రూ.7.73కోట్లు రిలీజ్
- లకారం దగ్గర అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రూ.10కోట్లు
ఖమ్మం, వెలుగు: ఇన్నాళ్లు ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే రూట్లో లింక్ రోడ్లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడగా, తర్వలో ఆ సమస్యకు చెక్‌పడనుంది. ఖమ్మం, సూర్యాపేట హైవేపై మద్దులపల్లి నుంచి పొన్నెకల్లు వరకు ఒకటిన్నర కిలోమీటరు మేర డబుల్ రోడ్డు మాత్రమే ఉంది. రోడ్డుకు ఇరువైపులా ఎలాంటి డివైడర్లు లేవు. దీంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గడిచిన ఆరు నెలల్లో జరిగిన యాక్సిడెంట్లలో నలుగురు చనిపోగా, 10 మందికి పైగా గాయాలపాలయ్యారు. కొత్త హైవే కావడంతో వాహనదారులు విపరీతమైన వేగంతో వెళ్తున్నారు. మద్దులపల్లి, పొన్నదూరం మధ్య రోడ్డు చిన్నగా ఉండడంతో స్పీడ్ కంట్రోల్ కావడం లేదు.
ఈ నేపథ్యంలో ఇక్కడి డబుల్‌రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించి, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసేందుకు నేషనల్హైవే అథారిటీ రూ.7.73 కోట్లు మంజూరు చేసింది. శనివారం దీనికి సంబంధించిన ఉత్తర్వులు రిలీజ్ అయ్యాయి. విస్తరణ పనులు పూర్తయితే రోడ్డు ప్రమాదాలకు చెక్ పడనుంది. ఇక ఖమ్మం-, సూర్యాపేట నేషనల్హైవేను, విజయవాడ, హైదరాబాద్ నేషనల్ హైవేను కలిపేచోట బ్రిడ్జి(గ్రేడ్సపరేటర్) నిర్మించాల్సి ఉంటుంది. రాయినిగూడెం సమీపంలో అండర్ పాస్ గానీ, బ్రిడ్జి గానీ కట్టాల్సి ఉంది. ప్రస్తుతం ఖమ్మం నుంచి వెళ్లే వెహికల్స్సూర్యాపేట వైపు ముందుకు రెండు కిలోమీటర్లు వెళ్లి యూటర్న్తీసుకొని హైదరాబాద్వెళ్లాల్సి వస్తోంది. అక్కడ విజయవాడ, హైదరాబాద్ హైవేపై అండర్‌బ్రిడ్జి నిర్మించేందుకు ఇటీవల రూ.46 కోట్లు మంజూరయ్యాయి. రెండు చోట్ల త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.
అండర్ గ్రౌండ్ కాల్వలపై..
అలాగే ఖమ్మం సిటీలోని లకారం ట్యాంక్‌బండ్, మినీ ట్యాంక్‌బండ్ మధ్య మురుగు సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసింది. రెండింటి మధ్య ఉన్న మురుగు కాల్వను క్లీన్‌చేసి, అండర్గ్రౌండ్పైప్ లైన్ నిర్మించనున్నారు. దీర్ఘకాలికంగా ఉన్న మురుగు సమస్యను మంత్రి అజయ్‌కుమార్... మంత్రి కేటీఆర్దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేశారు. దీంతో వైరా రోడ్డులోని నాగార్జున ఫంక్షన్ హాల్ నుంచి చెరువు బజార్ మజీద్ వరకు దాదాపు1.8 కి.మీ. మేర అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా మురుగు, వర్షపు నీరు వేరు వేరుగా వెళ్లేందుకు కార్యాచరణ చేపట్టారు. మురుగు నీరు ప్రకాశ్‌నగర్ దగ్గర ఉన్న ఎస్టీపీ(సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్)కి వెళ్తుంది. మరో పైప్ లైన్ ద్వారా వెళ్లిన వర్షపు నీరు నేరుగా మున్నేరులో కలవనున్నాయి. అండర్ గ్రౌండ్ కాల్వల పైన ఆహ్లాదం పంచేలా పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టనున్నారు. గోళ్లపాడు చానల్ పై తీర్చిదిద్దిన మాదిరిగా పార్కులు, ఓపెన్ జిమ్ లు, ప్లాంటేషన్ ఏర్పాటు చేయనున్నారు. డ్రైనేజ్ నిర్మాణ పనులను మంత్రి పువ్వాడ అజయ్ ఆదివారం పరిశీలించారు. మూడు నెలల్లోపే పనులు పూర్తిచేస్తామని తెలిపారు.