- కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు దాదాపు 50 కిలోమీటర్ల పనులు
- రూ. 250 కోట్లతో పనులు షురూ.. ఏండ్ల కొద్దీ కొనసాగింపు
- పెరిగిన ఖర్చులతో చేతులెత్తేసిన కాంట్రాక్టర్
- పట్టించుకోని అధికారులు.. ఇబ్బందుల్లో ప్రజలు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు రూ. 250కోట్లతో చేపట్టిన 50కిలోమీటర్ల హైవే వర్క్స్ ప్రారంభించి పదేండ్లు అయినా ఇంకా కంప్లీట్ కావడం లేదు. అప్పుడు ఎస్టిమేషన్ కు ప్రస్తుత ఖర్చులకు భారీగా వ్యత్యాసం ఉండడంతో పనులు చేయలేనంటూ కాంట్రాక్టర్ చేతులెత్తేశాడు. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
ఇదీ పరిస్థితి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నుంచి చత్తీస్‌గఢ్ లోని జగదల్ పూర్ వరకు నేషనల్ హైవే పనులను సెంట్రల్ గవర్నమెంట్పదేండ్ల కిందట మొదలు పెట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు రూ. 250 కోట్లతో దాదాపు రూ. 50 కిలోమీటర్ల మేర 2014లో పనులను కాంట్రాక్టర్ మొదలు పెట్టారు. తొలుత స్పీడ్‌గానే పనులు చేపట్టిన కాంట్రాక్టర్ తర్వాత డిలే చేశాడు. ఆఫీసర్లు కూడా చూసీ చూడనట్లుగా ఉన్నారు. దీంతో ఏండ్లు గడుస్తున్నా పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. రోడ్డుకు ఇరువైపుల నిర్మిస్తున్న డ్రైనేజీలు పనులు కూడా ఇంకా పూర్తి కాలేదు. దీంతో ఇటీవల వర్షాలకు ఎక్కడి నీళ్లు అక్కడే నిలిచి మురుగు కుంటలను తలపించాయి. దోమలకు అవాసంగా మారాయి.
ప్రయాణికులకు తప్పని తిప్పలు
ఏండ్ల కొద్దీ కొనసాగుతున్న రోడ్డుతో వాహన దారుల అవస్థలు వర్ణనాతీతం. రోడ్డు యాక్సిడెంట్లతో ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. ఇటీవల కాంట్రాక్టర్‌తో పాటు ఎన్‌హెచ్ ఆఫీసర్ల తీరుపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసహనం వ్యక్తం చేశారు. పలుమార్లు దిశ మీటింగ్‌ల్లో ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు అసంపూర్తి నిర్మాణాలపై మండిపడ్డారు.
కాగా రోడ్డు, డ్రైనేజీల నిర్మాణాలకు అవసరమైన ల్యాండ్‌ను ఇన్ టైంలో తనకు ఆఫీసర్లు అప్పగించలేదని కాంట్రాక్టర్ వాపోయాడు. టెండర్ ఒప్పందం టైంలో కన్నా రెండింతలు రేట్లు పెరిగాయని, ఇప్పుడున్న రేట్ల ప్రకారం పనులు చేయలేమంటూ అతడు చేతులెత్తేశాడు. పనులు స్లోగా చేస్తుండడంపై పలు మార్లు కాంట్రాక్టర్‌కు నోటీస్‌లు ఇచ్చామని ఎన్‌హెచ్ ఆఫీసర్లు చెబుతున్నారు. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా అసంపూర్తిగా ఉన్న పలు చోట్ల రోడ్డు నిర్మాణాలు తామే చేపట్టామంటున్నారు. ఏదేమైనా హైవే పనులు త్వరగా పూర్తిచేయాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రమాదాలు జరుగుతున్నయ్...
కొత్తగూడెం పట్టణం రామవరంలో నేషనల్ హైవే రోడ్డును అడ్డదిడ్డంగా నిర్మించారు. బైక్‌లు నడిపే వాళ్లు ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్డు కిరువైపులా డ్రైనేజీలను సగం చేసి వదిలేశారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. మునిగడప పద్మ, కౌన్సిలర్, కొత్తగూడెం
అసంపూర్తి డ్రైనేజీలతో మురుగు..
కొత్తగూడెం పట్టణంలో నేషనల్ హైవేలో భాగంగా చేపట్టిన రోడ్డు కిరువైపులా డ్రైనేజీ పనులు అసంపూర్తిగా నిలిచాయి. వాన కాలంలో మురుగునీరంతా నిల్వ ఉండడం, రోడ్డుపైకి ప్రవహిస్తుండడంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. డివైడర్లు కూడా సరిగా నిర్మించలేదు. - కరీశ రత్నకుమారి, కొత్తగూడెం