- సంధ్య థియేటర్ ఘటనపై సమన్లు జారీ చేసిన సంస్థ
హైదరాబాద్, వెలుగు: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో డీజీపీ జితేందర్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌కు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నోటీసులు జారీ చేసింది. థియేటర్ వద్ద తొక్కిసలాట, లాఠీచార్జ్‌పై సీనియర్ పోలీసు అధికారితో సమగ్ర విచారణ జరిపించాలని బుధవారం జారీ చేసిన నోటీసుల్లో ఆదేశించింది. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించింది. 4 వారాల్లోగా పూర్తి నివేదికను సమర్పించాలని చెప్పింది. పుష్ప 2 బెన్‌ఫిట్ షో సందర్భంగా డిసెంబర్ 4న సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు.
ఈ ఘటనపై హైకోర్టు న్యాయవాది ఇమ్మనేని రామారావు డిసెంబర్ 5న ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. తొక్కిసలాటకు పోలీసుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. థియేటర్‌లో సరైన భద్రతా చర్యలు తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. హీరో అల్లు అర్జున్ వచ్చిన సమయంలో అవసరమైన చర్యలు చేపట్టలేదన్నారు. తొక్కిసలాట, పోలీసుల లాఠీచార్జ్‌పై విచారణకు ఆదేశించాలని కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో గత నెల 17న ఎన్‌హెచ్‌ఆర్‌సీ కేసు నమోదు చేసుకొని, సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని ఆదేశించింది.