జాతీయాదాయ అంచనాలు ప్రతి సంవత్సరం ఉత్పత్తి అవుతున్న వస్తుసేవల గురించి తెలుపుతాయి. జాతీయాదాయం పెరుగుదల దేశాభ్యున్నతికి సూచిక. తలసరి ఆదాయంలోని పెరుగుదల జీవన ప్రమాణ స్థాయిని తెలియజేస్తుంది. జాతీయాదాయ లెక్కలు, ఉత్పత్తి సాధనాల మధ్య ఆదాయం ఏ విధంగా పంపిణీ అయిందో తెలుపుతుంది. అయితే జాతీయ గణనలో పలు సమస్యలు ఎదురవుతాయి. వాటిని భావనాత్మక, ఆచరణాత్మక సమస్యలుగా విభజించవచ్చు.
భావనాత్మక సమస్యలు
సేవలు: జాతీయాదాయ గణనలో సేవలను లెక్కించాలా? మినహాయించాలా? అనేది సమస్య. మార్క్సియన్ ఆర్థికవేత్తలు సేవలను మినహాయించాలి అని భావించగా, మిగిలిన వారు చేర్చాలని భావించారు. సోషలిస్ట్ దేశాలు మినహాయించగా, పెట్టుబడిదారి దేశాలు(ఇండియాతో కలిపి) చేరుస్తున్నాయి.
గృహిణి సేవలు: చాలా రకాల సేవలకు ద్రవ్య రూపంలో చెల్లింపులుండవు. గృహిణి సేవలు(వంట చేయడం, పిల్లల సంరక్షణ), తోటపని, పిల్లలకు పాఠాలు చెప్పడం మొదలైన వాటిలో ప్రేమ, అఫెక్షన్ కలిసి ఉండటంతో వాటిని ద్రవ్య రూపంలో గణించడం కష్టం. భారతదేశం లాంటి అల్పాభివృద్ధి దేశాల్లో ఇలాంటి సేవలు ఎక్కువ కాబట్టి జాతీయాదాయం తక్కువగా అంచనా వేస్తారు. సేవా సమస్యలను పిగూ వివరించడంతో దీనిని పిగూ వైపరీత్యం అంటారు.
మధ్యంతర వస్తువుల గుర్తింపు సమస్య: జాతీయాదాయ గణనలో అంతిమ వస్తువులే తీసుకుంటారు గాని మధ్యంతర వస్తువులు తీసుకోరు. అయితే, వీటి మధ్య కచ్చితమైన తేడాను గుర్తించలేం. చాలా వస్తువులు వాటి వినియోగం బట్టి మారుతుంటాయి. బేకరీ వాడికి పిండి మధ్యంతర వస్తువు కాగా, గృహిణికి అంతిమ వస్తువు. ఆఫీసుకు చేరుకోవడానికి అయ్యే రవాణా వ్యయం మధ్యంతర వ్యయం కాగా, కుటుంబం హాలీడే ట్రిప్పుకు వెళ్లే రవాణా వ్యయం అంతిమ వ్యయం అవుతుంది.
ప్రభుత్వ పరిపాలన: ప్రభుత్వం అందించే సేవలు, పాలనా వ్యయంలో ఎంత మేరకు జాతీయోత్పత్తికి దోహదపడునో కచ్చితంగా చెప్పలేం.
ఉదా: శాంతిభద్రతలు, పార్కులపై చేసే వ్యయం.
ఆధార సంవత్సరంలో లేని ఉత్పత్తి: ఆధార సంవత్సరంలో లేకుండా, తర్వాత కాలంలో నూతన వస్తువుల ఉత్పత్తి జరిగితే, వాటిని స్థిర ధరలలో లెక్కించేటప్పుడు సమస్యలు ఎదురవుతాయి.
ఇన్వెంటరీల్లో మార్పునకు విలువ కట్టడం: ఇన్వెంటరీల్లో మార్పునకు విలువ కట్టేటప్పుడు ఒర్జినల్ కాస్ట్ ఆధారంగా గణించాలా? లేదా ప్రస్తుత ధరల్లో గణించాలా? అనేది మరో సమస్య.
తరుగుదల అంచనా: తరుగుదల విలువను యంత్రం ఒర్జినల్ కాస్ట్‌పై అంచనా వేయలా? లేదా రిప్లేస్ మెంట్ కాస్ట్ ఆధారంగా గణించాలా? అనేది మరో సమస్య.
నివేదించని చట్ట వ్యతిరేక ద్రవ్యం: ఆదాయ, సంపద పన్ను ఎగవేత కోసం సరైన ఆదాయ, సంపద సమాచారాన్ని ఇవ్వలేదు. ఇది బ్లాక్ మనీకి దారితీస్తుంది. చట్టబద్ధ, చట్టవ్యతిరేక ద్రవ్యాలు ఉండటాన్ని సమాంతర ఎకనామీ అంటారు. దీనివల్ల జాతీయాదాయం తక్కువ అంచనా వేయబడుతుంది.
విశ్వసించదగ్గ గణాంకాలు లభ్యం కాకపోవడం: భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రధాన సమస్య విశ్వసనీయమైన గణాంకాలు లేకపోవడం. శిక్షణపొందిన గణకుల కొరత వల్ల సరైన సమాచారం రాకపోవడం, వ్యవసాయ ఉప ఉత్పత్తులైన కూరగాయలు, పండ్లు, టింబర్ మొదలైన వాటికి సంబంధించిన సరైన సమాచారం లేకపోవడం కనిపిస్తుంది.
చిన్న ఉత్పత్తిదార్లు: అకౌంట్ల ప్రాధాన్యతను గుర్తించక అకౌంట్స్ నిర్వహించకపోవడంతో సరైన సమాచారం ఇవ్వలేకపోతున్నారు.
పెద్ద సంస్థలు, ఉత్పత్తిదార్లు: పన్ను భారం నుంచి తప్పించుకొనేందుకు తప్పుడు లెక్కలు చూపుతున్నారు.
అంచనాల ప్రాధాన్యంఆర్థిక పురోభివృద్ధికి సూచీగా పనిచేస్తుంది.
- వివిధ దేశాల జాతీయ, తలసరి ఆదాయాల సరిపోలికకు ఉపయోగపడుతుంది.
- ఆర్థిక వ్యవస్థలో వచ్చే వ్యవస్థాపూర్వక మార్పులు అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది
- వివిధ రంగాల నుంచి వచ్చే సాపేక్ష వాటాలను తెలుసుకోవచ్చు.
- ఆర్థిక వ్యవస్థలోని వివిధ వర్గాల ప్రజల ఆదాయ వ్యత్యాసాలు తెలుసుకోవచ్చు.
- ప్రణాళిక రచనకు జాతీయాదాయం లెక్కలు దోహదపడుతాయి.
- ఒక దేశంలోని వేర్వేరు కాలాల్లో ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధిని సరిపోల్చవచ్చు.
- రాష్ట్రాల ఉత్పత్తి సహాయంతో దేశంలో వివిధ ప్రాంతాల మధ్య ప్రాంతీయ వ్యత్యాసాలు గ్రహించవచ్చు.
- తలసరి ఆదాయాన్ని గణించి, ప్రజల జీవన ప్రమాణాన్ని అంచనా వేయవచ్చు.
- జీఎన్పీలో శ్రామికులు పొందే వాటాల ఆధారంగా ట్రేడ్ యూనియన్, లేబర్ ఆర్గనైజేషన్ తమ విధానాలు రూపొందించుకోవచ్చు.
దేశాల మధ్య సరిపోలిక సమస్య
వేర్వేరు కొనుగోలు శక్తి, కరెన్సీలు ఉన్న దేశాల మధ్య జాతీయ, తలసరి ఆదాయాలు, జీవన ప్రమాణాలు సరిపోల్చడం అర్థరహితమని కొందరు ఆర్థికవేత్తల అభిప్రాయం.
ఆచరణాత్మక సమస్యలు
భారతదేశం లాంటి వెనుకబడిన దేశాల్లో అవ్యవస్థీకృత, ద్రవ్యేతర రంగం ఎక్కువ.
ద్రవ్యేతర రంగం
ద్రవ్యం ఉపయోగించకుండా వస్తుసేవలు బార్టర్ పద్ధతి ద్వారా వినిమయం అయ్యే రంగాన్ని ద్రవ్యేతర రంగం అంటారు. వ్యవసాయ రంగంలో చాలా ఉత్పత్తి ద్రవ్య మార్కెట్లోకి రాకుండా సొంత వినియోగం, వస్తు మార్పిడి ద్వారా వినిమయంలోకి పోతుంది. ఫలితంగా జాతీయాదాయ లెక్కలు అంచనాపైనే జరుగుతున్నాయి.
వృత్తి ప్రత్యేకీకరణ లేకపోవడం
భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వృత్తి ప్రత్యేకీకరణ లేకపోవడంతో సంవత్సర కాలంలో ఒకదాని కంటే ఎక్కువ కార్యకలాపాల్లో పాల్గొన్నప్పటికీ, ఏదో ఒక కార్యకలాపంలో వచ్చే ఆదాయమే లెక్కల్లోకి వస్తుంది.