లియో బేక్‌ల్యాండ్ అనే బెల్జియన్ కెమిస్ట్ 1907లో ప్లాస్టిక్ తయారుచేశాడు. అప్పటినుండి ఇప్పటివరకు ప్లాస్టిక్ ఏ స్థాయిలో వాడకంలోకి వచ్చిందో చూస్తూనే ఉన్నాం. ఏ చిన్న వస్తువు కొన్నా ప్లాస్టిక్ దాని వెంటే ఉంటోంది. ప్లాస్టిక్ వల్ల వచ్చే వ్యర్ధాలు మానవాళికి ముప్పు. దాన్ని కాల్చడం వల్ల ప్రకృతి కాలుష్యం అవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే పర్యావరణాన్ని, మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని ఎన్ని క్యాంపెయిన్‌లు పెట్టినా, ఎంత అవేర్‌నెస్ కల్పించినా మనుషుల్లో మార్పు రావడం లేదు. వాడకం తగ్గించడం లేదు. ఇంతింతై వటుడింతై అన్నట్టు భూమ్మీద గుట్టలుగా పేరుకుపోయి, అది కాస్తా మైక్రో ప్లాస్టిక్ రూపంలో మనిషి రక్తంలోకి చేరింది.
యూఎస్‌లోని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ’ వాళ్లు మనిషి రక్తంలో మైక్రో ప్లాస్టిక్ ఉందని కనిపెట్టారు. తరువాత నెదర్లాండ్‌లోని రీసెర్చర్లు పూర్తి ఆరోగ్యంగా ఉన్న 22 మంది రక్తాన్ని టెస్ట్ చేశారు. ఆ టెస్టుల్లో 18 మంది రక్తంలో దాదాపు 80% వరకు మైక్రో ప్లాస్టిక్ ఉన్నట్టు తేలింది. ‘దీని వల్ల ఆరోగ్యంపైన ఇప్పుడంత ప్రభావం లేకపోయినా పిల్లలకు, భవిష్యత్తులో పుట్టబోయేవాళ్లపైన తీవ్ర ప్రభావం ఉంటుంది. కొత్త రకం క్యాన్సర్‌లు పుట్టే అవకాశం ఉందని’ పరిశోధకులు చెప్తున్నారు. ప్లాస్టిక్ భూమిపైన ఎంతలా పేరుకు పోయిందంటే.. అత్యంత లోతైన సముద్రం మరియానా ట్రెంచ్‌లో, ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ పైన కూడా ప్లాస్టిక్ గుట్టలు పేరుకు పోవడమే అందుకు నిదర్శనం.
ఎక్కడి నుండి వస్తుంది?
మరి మైక్రో ప్లాస్టిక్ రక్తంలోకి ఎలా చేరింది? అనేదే పెద్ద ప్రశ్న.. పసి పిల్లలకు పాలు పట్టడానికి వాడే పాల డబ్బానుండి మొదలు పెడితే ఫుడ్ ప్యాకింగ్, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, టూత్ పేస్ట్, టీ కప్పుల వరకు రోజూ వాడే వస్తువుల నుంచి మన రక్తంలోకి ప్లాస్టిక్ చేరుతోంది. ఫుడ్ ప్యాకేజ్‌లో వాడే ప్లాస్టిక్‌ను ‘పాలిస్టైరిన్ ప్లాస్టిక్’ అని, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్‌లో వాడే ప్లాస్టిక్‌ను ‘పిఇటి ప్లాస్టిక్’ (పాలిథైలిన్ టెరెఫ్టలేట్) అని అంటారు. వీటిలో ఎక్కువ కాలం స్టోర్ చేసినా, వేడి పదార్థాలు పోసినా ప్లాస్టిక్ కరిగి ఫుడ్‌లో చేరుతుంది. అంతేకాదు గాలి ద్వారా కూడా శరీరంలోకి చేరుతుంది ప్లాస్టిక్. అదెలాగంటే కాల్చిన ప్లాస్టిక్ నుండి వచ్చిన ప్లాస్టిక్ డస్ట్ గాలిలో కలిసి వంట్లో తిష్టవేస్తుంది.
ఉప్పు, చేపలు కూడా...ఇవే కాకుండా సముద్రం నుంచి వచ్చే ఉప్పు, చేపల్లో కూడా మైక్రో ప్లాస్టిక్ ఉంటుంది. అదెలాగంటే... సముద్రం నీటి నుండే కదా ఉప్పు తయారయ్యేది. అందులో పడేసిన ప్లాస్టిక్ మైక్రో పార్టికల్స్ నీళ్లలో కలుస్తాయి. ఇప్పటికి 51 ట్రిలియన్ మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్ సముద్రంలో ఉన్నాయి. ఆ నీటి నుండి ఉప్పు తయారుచేసినపుడు దాన్లోకి మైక్రో ప్లాస్టిక్ చేరుతుంది. చేపలు సముద్రంలోని ప్లాస్టిక్ తింటున్నాయని చాలా సందర్భాల్లో చదివే ఉంటారు. దాదాపు 33 శాతం సముద్ర చేపల్లో మైక్రో ప్లాస్టిక్ ఉందని యునైటెడ్ నేషన్స్ రీసెర్చ్‌లో తేలింది. ‘వీటిని తిన్నపుడు వాటిలో ఉన్న మైక్రో ప్లాస్టిక్ కూడా మన రక్తంలోకి చేరుతుంది’ అని నెదర్లాండ్ యూనివర్సిటీ ప్రొఫెసర్
డిక్ వెతాక్ అన్నాడు
సంవత్సరానికి 74,000 నుంచి 1,21,000 మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్‌ను మనుషులు తింటున్నారట. ‘అది ఆహారం ద్వారా శరీరంలోనికి వెళ్తుంది. వెళ్తే వెళ్లింది. మలం ద్వారా బయటికి వస్తుందిలే అని అనుకుంటే పొరపాటు. ఆహారం ద్వారా లోపలికి చేరి, అక్కడ జీర్ణం అయిన ఆహారంతో రక్తంలో కలుస్తుంది. అలా శరీర భాగాలన్నింటికీ రక్తం ద్వారా చేరుతుంది. అలా చేరిన ప్లాస్టిక్.. శరీరంలో ఏ భాగంలో అయినా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. తరువాత ఎలాంటి రోగాలకు దారి తీస్తుందో ఊహించలేం’ అని రీసెర్చర్లు అంటున్నారు.