జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను విజయవంతం చేయాలి

జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను విజయవంతం చేయాలి

కోరుట్ల, వెలుగు: హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమై 2022 సెప్టెంబర్ 17 నాటికి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ రవి, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు పిలుపునిచ్చారు. గురువారం కోరుట్లలోని  కొత్త బస్టాండ్ వద్ద సమైక్యత వజ్రోత్సవ ర్యాలీ ఏర్పాట్లను వారు పరిశీలించారు. తెలంగాణ ప్రజల పోరాట పటిమ, సంస్కృతీసంప్రదాయాలు, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం ఘనంగా చాటేలా వజ్రోత్సవాల్లో ప్రజలు పాల్గొనాలన్నారు.  ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. వారి వెంట డిప్యూటీ కలెక్టర్ లత, ఎస్పీ సింధూ శర్మ, డీఎస్పీ రవీందర్ రెడ్డి, ఆర్డీఓ వినోద్ కుమార్, తహసీల్దార్ రాజేశ్, మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య , మున్సిపల్ కమిషనర్ అయాజ్, ఎంపీపీలు నారాయణ, సాయిరెడ్డి తదితరులు ఉన్నారు. 

నేటి ర్యాలీ, సభకు సర్వం సన్నద్ధం 

సిరిసిల్ల కలెక్టరేట్: తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలకు సర్వం సిద్ధం చేశామని కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. గురువారం సిరిసిల్ల కాలేజ్ గ్రౌండ్ లో కలెక్టర్ ఎస్పీ రాహుల్ హెగ్డేతో కలిసి వజ్రోత్సవాల ఏర్పాట్లును పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నేడు మినిస్టర్ కేటీఆర్ జాతీయ సమైక్యత కార్యక్రమంలో 12 గంటలకు సిరిసిల్లలో, మధ్యాహ్నం 2 గంటలకు వేములవాడ పట్టణంలో పాల్గొంటారని తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలో 15 వేల వరకు ప్రజలు హాజరవుతున్నందున ప్రధాన వేదికతో సహా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. వేడుకలకు హాజరయ్యే ప్రజలందరికీ సీటింగ్, తాగునీరు, భోజన ఏర్పాట్లు చేశామన్నారు. సభ ప్రారంభానికి ముందు భారీ ర్యాలీ తీయనున్నారు. వారి వెంట అడిషనల్  కలెక్టర్లు బి.సత్యప్రసాద్, ఖీమ్యా నాయక్ ఉన్నారు.