కామారెడ్డి, వెలుగు: జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు కామారెడ్డి ఆతిథ్యమివ్వనుంది. ఎస్జీఎఫ్(స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్) ఆధ్వర్యంలో అండర్–17 బాయ్స్ కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ నెల 7 నుంచి 11 వరకు ఈ పోటీలు జరుగుతాయి. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే టీమ్స్ఈ నెల 6న రిపోర్ట్ చేస్తాయి. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో ఈ పోటీలను నిర్వహిస్తారు.
ఏర్పాట్లపై ఆఫీసర్లు దృష్టి సారించారు. దేశంలోని 31 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి క్రీడాకారులు రానున్నారు. మొత్తం 650 మంది కబడ్డీ ఆటగాళ్లు పాల్గొంటారు. పోటీల నిర్వహణకు పీఈటీలు, పీడీలు, విద్యా శాఖ, యూత్ వెల్ఫేర్‌శాఖ ఆధ్వర్యంలో కమిటీలు వేశారు. ఏర్పాట్లపై కలెక్టర్ జితేశ్ వీ పాటిల్‌తో ఆఫీసర్లతో చర్చించారు. పోటీలకు వచ్చే క్రీడాకారులు, కోచ్‌లు, టీమ్ మేనేజర్లకు వసతి, భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.
స్థానిక మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, డెయిరీ కాలేజీలో క్రీడాకారులకు బస ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా బస్టాండ్, రైల్వే స్టేషన్లలో స్థానిక పీఈటీలతో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. జనవరి 7న పోటీలు ప్రారంభమవుతాయి. పొద్దున ప్రారంభ వేడుకలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు. ముగింపు వేడుకలకు కేంద్ర, రాష్ట్ర మంత్రులను ఆహ్వానించనున్నారు.