బెల్లంపల్లి, వెలుగు: జాతీయస్థాయి సాఫ్ట్ బేస్ బాల్ పోటీలు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టౌన్ లో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. బాలగంగాధర్ తిలక్ స్టేడియంలో 9వ సబ్ జూనియర్, యూత్ నేషనల్ సాఫ్ట్ బేస్ బాల్ బాల, బాలికల పొటీలను ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి, సాఫ్ట్ బేస్ బాల్ రాష్ట్ర అధ్యక్షుడు పులియాల రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జాతీయ స్థాయి పోటీలకు బెల్లంపల్లి వేదిక కావడం ఆనందంగా ఉందన్నారు.
కోల్ ఇండియా క్రీడాకారుడు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రవికుమార్ సొంత ఖర్చులతో పుట్టిన గడ్డలో క్రీడాపోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 400 మందికి పైగా క్రీడాకారులు తరలివచ్చారు. మూడు రోజుల పాటు జరుగుతాయి. సాఫ్ట్ బేస్ బాల్ రాష్ట్ర సెక్రటరీ దుర్గం గురవేందర్ సింగ్, జాయింట్ సెక్రటరీ ఉప్పులేటి వెంకటేశ్, ట్రెజరర్ ఇమ్మాన్యుయల్, దినాకర్ జిల్లా త్రోబాల్ సెక్రటరీ బలరాం, టైక్వాండో ఉమ్మడి జిల్లా ఇన్ చార్జి జిల్లపల్లి వెంకటస్వామి, అండర్ –19 ఎస్ జీఎఫ్ సెక్రటరీ బాబు రావు, పీడీ రాజ్ మహ్మద్, శ్రావణ్ తదితరులు ఉన్నారు.