పౌర విశ్వ విద్యాలయాలుగా గ్రంథాలయాలు

పౌర విశ్వ విద్యాలయాలుగా గ్రంథాలయాలు

భారత జాతీయ  గ్రంథాలయ వారోత్సవాలు నవంబర్ 14 నుంచి 20 వరకు నిర్వహిస్తున్నారు . కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం  ప్రతి పౌర గ్రంథాలయాలలో,  విద్యా గ్రంథాలయాలలో  తమ దగ్గర ఉన్న పుస్తక వనరులతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి గ్రంథాలయాలకు పాఠకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.  పౌర గ్రంథాలయాలు మేధో వికాసాన్ని  ప్రోత్సహించే, ప్రజల ఆలోచనలను విస్తరించే కమ్యూనిటీ హబ్​లుగా  కీలక పాత్ర పోషిస్తున్నాయి.

గ్రంథాలయాలను పట్టించుకోని ప్రభుత్వాలు

రాజారామ్ మోహన్​రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ పౌర గ్రంథాలయాల అభివృద్ధికి ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తోంది.   జాతీయస్థాయి, రాష్ట్రస్థాయి సెమినార్లకు, వర్క్​షాప్​లకు,  లైబ్రరీ కార్యక్రమాలకు నిధులు మంజూరు చేస్తున్నది.  ముఖ్యంగా  గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అనేక పౌర గ్రంథాలయాలకు  మౌలిక వసతులు,  పుస్తక వనరులు, భవన నిర్మాణాలకు సహాయ సహకారాలు అందించి చదువరులకు విస్తృత సేవలు అందించే ప్రయత్నం చేస్తోంది.  దురదృష్టవశాత్తూ దేశంలో చాలా రాష్ట్రాలు పౌర గ్రంథాలయాలను నిర్వహించడానికి ఒక చట్టం కానీ,  ప్రామాణికాలనుగాని కలిగి లేవు.  

గ్రంథాలయ చట్టాలు తేవాలి

దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే వాటిలో 20 రాష్ట్రాలు మాత్రమే పౌర గ్రంథాలయాల చట్టాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాల  పరిస్థితి గొప్పగా ఏమీ లేదు.  గ్రంథాలయాలు అంటే ప్రభుత్వాలకు పట్టని వ్యవస్థగా,  జవాబుదారీతనం   లేకపోవడం,    స్థానిక సంస్థలు,   నగర      కార్పొరే
షన్  లేదా గ్రామ పంచాయతీలు చెల్లించే  గ్రంథాలయ పన్నులను  గ్రంథాలయాలకు  చెల్లించడం లేదు.  అయితే,  హైదరాబాద్ మహానగరం నుంచి దాదాపు వెయ్యికోట్లకు పైగా,  ముంబై మహానగరం నుంచి రూ. 450 కోట్లు,  బెంగళూరు మహానగరం నుంచి  రూ. 350 కోట్లు పౌర గ్రంథాలయాలకు చెల్లించవలసి ఉన్నది. భారతదేశంలో విద్యాసంస్థలలో,  సామాజిక,  సాంస్కృతిక ప్రదేశాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాలలో,  కేంద్ర పాలిత ప్రాంతాలలో  గ్రంథాలయ చట్టాలు తేవాలి.

మౌలిక సదుపాయాల కొరత

ప్రముఖ ఆంగ్ల పత్రిక టైమ్స్ 2022 ప్రకారం.. జాతీయవ్యాప్తంగా పౌర గ్రంథాలయాల భవనాలు  అనుకున్న స్థాయిలో లేవు. 48% పౌర గ్రంథాలయాలకు మాత్రమే  పక్కాభవనాలు,  సొంతభవనాలు కలవు.  52 శాతం  అద్దె   భవనాలలో  పౌర గ్రంథాలయాలు సేవలందిస్తున్నాయి. అదేవిధంగా గ్రంథపాలకుల గురించి వివరిస్తూ 46% మాత్రమే  పౌర గ్రంథాలయాలను నిర్వహిస్తున్నారు.  మిగతా 24% నిర్వాహకులు  (పొరుగు సేవలు, ఒప్పంద, అర్హత లేని గ్రంథ పాలకులు) నిర్వహణలో గ్రంథాలయాలు కొనసాగుతున్నాయి. 30% గ్రంథ పాలకుల ఉద్యోగాలు ఖాళీలుగా 
ఉండడం విశేషం. 

  పబ్లిక్​ లైబ్రరీస్​ను బలోపేతం చేయాలి  

2017 ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్స్ అండ్ ఇనిస్టిట్యూషన్స్  నివేదిక ప్రకారం ఒక సగటు భారతీయ పబ్లిక్ లైబ్రరీలో  కేవలం 5,700 పుస్తకాలు ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాలలో పుస్తకాల సంఖ్య 1,08,000గా ఉన్నది.   ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పుస్తకాల కొనుగోలు సేకరణ జరగాలి.  2022 ప్రకారం యునెస్కో ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్  ‘మెజరింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఫర్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్’  ప్రకారం కేవలం 12% భారతీయ పబ్లిక్ లైబ్రరీలలో కంప్యూటర్లు ఉన్నాయి.   కేవలం 8%  మాత్రమే ఇంటర్నెట్ సదుపాయాన్ని కలిగి ఉన్నాయి.  పబ్లిక్ లైబ్రరీలు ఒకదానితో ఒకటి తమ సంబంధాలను (గ్రామీణ ప్రాంత గ్రంథాలయాల నుంచి  మండల ప్రాంత గ్రంథాలయాలు,  జిల్లాస్థాయి గ్రంథాలయాలు, రీజనల్ స్థాయి గ్రంథాలయాలు, రాష్ట్రస్థాయి  గ్రంథాలయాలు, జాతీయస్థాయి గ్రంథాలయాలు) బలోపేతం చేసుకోవాలి.  

- డా. రవికుమార్​ చేగోనీ,
ప్రధాన కార్యదర్శి,
 తెలంగాణ గ్రంథాలయ సంఘం