- గొర్లకు కోటి.. కోళ్లకు 50 లక్షల సాయం
- 50 శాతం సబ్సిడీ.. 40 శాతం లోన్
- గ్రామీణ రైతులకు ఉపాధి అవకాశాలు
మెదక్, వెలుగు: గ్రామీణ ప్రాంత రైతులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటు అందిస్తున్నాయి. వ్యవసాయంతోపాటు గొర్రెలు, నాటు కోళ్లు, పందులు, పశుగ్రాసం పెంచడం ద్వారా ఉపాధి పొందేందుకు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ (ఎన్ ఎల్ ఎం) కింద నాలుగు స్కీమ్‌లు అమలు చేస్తున్నారు. రూ.కోటి, రూ.50 లక్షల విలువైన యూనిట్లను అందిస్తుండగా ఇందులో 50 శాతం సబ్సిడీ ఉంటుంది.
యూనిట్ కాస్ట్ ఇలా..
గొర్ల పెంపకం యూనిట్‌కు రూ. కోటి అర్థిక సాయం అందిస్తున్నారు. ఒక్కో యూనిట్లో 500 గొర్రెలు, 25 పొటేళ్లు ఉంటాయి. ఇందులో రూ.50 లక్షలు ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. రూ.40 లక్షలు బ్యాంకుల నుంచి లోన్ వస్తుండగా.. రూ.10 లక్షలు లబ్దిదారు వాటాగా చెల్లించాల్సిఉంటుంది.
సైలేజ్ మేకింగ్ (పశుగ్రాసం పెంపకం) యూనిట్ కూ కూడా రూ.కోటి ఇస్తారు. ఇందులోనూ సబ్సిడీ, లోన్, లబ్దిదారు వాటా గొర్ల స్కీమ్లాగే ఉంటుంది. వెయ్యి నాటుకోళ్లు, 10 పుంజుల పెంపకం యూనిట్ కాస్ట్ రూ.50 లక్షలు కాగా రూ.25 లక్షలు సబ్సిడీ, రూ.20 లక్షలు బ్యాంక్ లోన్, రూ.5 లక్షలు లబ్దిదారు వాటాగా కట్టాలి. పందుల పెంపకం యూనిట్ కాస్ట్ రూ.30 లక్షలు కాగా.. రూ.15 లక్షలు సబ్సిడీ, రూ.12 లక్షలు బ్యాంక్ లోన్, రూ.3 లక్షలు లబ్దిదారు వాటాగా చెల్లించాలి.
మీసేవలో దరఖాస్తు
ఆసక్తి ఉన్న రైతులు మీసేవ కేంద్రం ద్వారా నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతోపాటు భూమికి సంబంధించిన పట్టా పాస్ బుక్, లీజ్ అయితే అందుకు సంబంధించిన డాక్యుమెంట్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్, బ్యాంక్ కాన్సెంట్ లెటర్, డిటేయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, ఎక్సిపీరియన్స్ సర్టిఫికెట్ అప్ లోడ్ చేయాలి.
దరఖాస్తు స్టేట్ ఇంప్లిమెంటేషన్ అథారిటీ (ఎస్ ఐ ఏ)కు వెళ్తుంది. వారు దరఖాస్తు వెరిఫికేషన్ చేసి జిల్లా వెటర్నరీ డిపార్ట్మెంట్కు పంపిస్తారు. వెటర్నరీ ఆఫీసర్లు ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఎన్ ఎల్ ఎం యాప్ లో అప్ లోడ్ చేస్తారు. అన్ని అర్హతలున్నవారికి సబ్సిడీ మంజూరవుతుంది.
జిల్లాలో 39 మంది ఆసక్తి
నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద ఆయా యూనిట్ల ఏర్పాటు కోసం మెదక్ జిల్లాలో 39 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో పలువురు రైతులు యూనిట్ లు ఏర్పాటు చేసుకోగా అర్హులైన కొందరికి సబ్సిడీ మంజూరైంది. మిగతా దరఖాస్తులు పరిశీలన దశలో ఉన్నాయి. చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామానికి చెందిన గొల్లరాజు, రామాయంపేట మండలం రాయిలాపూర్‌కు చెందిన సాయిరాం ఏర్పాటు చేసిన యూనిట్లకు ప్రభుత్వ సబ్సిడీ మంజూరైంది.
మెదక్ మండలం బాలానగర్ కు చెందిన బెండ వీణ, హవేలి ఘనపూర్ మండలం కూచన్‌పల్లికి చెందిన శేరి నారాయణ రెడ్డి సైతం యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. బెండ వీణ ఏర్పాటు చేస్తున్న యూనిట్లు ఇటీవల కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా వెటర్నరీ ఆఫీసర్ తో కలిసి పరిశీలించారు.
భూమి ఉంటే అప్లై చేసుకోవచ్చు
నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద నాలుగు స్కీంలు అమలవుతున్నాయి. వీటిని జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి. బీసీ, ఎస్టీ, ఎస్సీ, ఓసీ ఇలా ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. గొర్రెల పెంపకం, పశుగ్రాసం పెంపకం యూనిట్లు ఏర్పాటు చేసుకోదలచిన రైతులకు ఐదెకరాల స్వంత భూమి లేదా లీజు భూమి, బోరు వసతి, చాప్ కట్టర్, ఫీడర్ ఉండాలి. ఆసక్తి, అర్హత ఉన్న రైతులు మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. వెంకటయ్య, జిల్లా వెటర్నరీ ఆఫీసర్, మెదక్