నేషనల్ మార్కెటింగ్ పాలసీ కార్పొరేట్ల మేలుకే..అమలైతే భారీగా ఉద్యోగాలు పోతాయి: కోదండరెడ్డి

నేషనల్ మార్కెటింగ్ పాలసీ కార్పొరేట్ల మేలుకే..అమలైతే భారీగా ఉద్యోగాలు పోతాయి: కోదండరెడ్డి
  • రాష్ట్ర సర్కార్​కు ఏటా వెయ్యి కోట్లు నష్టం వస్తుంది
  • వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ అత్యవసర సమావేశం

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం నేషనల్​పాలసీ ఫ్రేమ్​వర్క్ ఆన్ అగ్రికల్చర్ మార్కెటింగ్(ఎన్​పీఎఫ్ఏఎం) పేరుతో వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను కార్పొరేట్ల పరం చెయ్యాలని చూస్తున్నదని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆరోపించారు. ఎన్​పీఎఫ్ఏఎం అంశంపై వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ శుక్రవారం బీఆర్కే భవన్ లో అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది.

మీటింగ్​లో కోదండరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ల ద్వారా వివిధ ఫీజుల రూపంలో ప్రతియేటా ప్రభుత్వానికి రూ.1000 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. మార్కెటింగ్ శాఖలో 2,500 పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పారు. ఎన్​పీఎఫ్ఏఎం అమలులోకి వస్తే వీరంతా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. అలాగే ప్రభుత్వం కూడా ఆదాయం నష్టపోతుందన్నారు. రైతు కమిషన్ నిర్దిష్టమైన వ్యవసాయ మార్కెటింగ్ విధానం అమలు అయ్యేలా ఒక రిపోర్ట్ రెడీ చేసి త్వరలోనే ప్రభుత్వానికి ఇవ్వనున్నట్లు తెలిపారు.

రద్దైన మూడు రైతు వ్యతిరేక చట్టాల్లాంటిదే

రైతులు తమ పంటలు, ఉత్పత్తులను అమ్ముకుంటున్న ప్రస్తుత వ్యవస్థ దేశంలో దశాబ్దాలుగా అమలులో ఉందని కోదండరెడ్డి తెలిపారు. రైతు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అధికారంలో ఉంటే అప్పుడూ ఈ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తున్నదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం గతంలో మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా రైతులు సుదీర్ఘమైన పోరాటం చేసి వాటిని రద్దు చేయించారని చెప్పారు. అయితే మళ్లీ అదే విధానంలో ఎన్​పీఎఫ్ఏపీ తీసుకువచ్చేందుకు కేంద్రం పూనుకుందని విమర్శించారు.

అగ్రికల్చర్, మార్కెటింగ్, సివిల్ సప్లై, మార్క్​ఫెడ్ అధికారులు, రైతు సంఘాల నాయకులు, ఎన్జీవోలు, మార్కెటింగ్​ఎక్స్​పర్ట్స్​సమావేశంలో ఈ పాలసీపై చర్చించారు. దీంతో భవిష్యత్ లో వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థ మొత్తం కార్పొరేట్ చేతుల్లోకి పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, చిలుక మధుసూదన్ రెడ్డి,  శ్రీలక్ష్మి, రైతు కమిషన్ సభ్యులు పాల్గొన్నారు.