హైదరాబాద్, వెలుగు: మంచిర్యాల మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పర్మిషన్ నిరాకరించింది. మెడికల్ కాలేజీ తరగతి గదులుగా రేకుల షెడ్లను చూపించడంతోనే అనుమతి ఇచ్చేందుకు ఎన్‌ఎంసీ నిరాకరించినట్టు తెలిసింది. గతేడాది దరఖాస్తు చేసిన 8 కాలేజీల్లో మంచిర్యాల కూడా ఉంది. ఇక్కడ ఉన్న ఓ గోదాంకు మార్పులు చేయించి, రేకుల షెడ్లు వేశారు. కాలేజీ కోసం శాశ్వత భవనం నిర్మించే వరకు తాత్కాలికంగా ఈ షెడ్లలోనే కాలేజీ నడిపిస్తామని ఎన్‌ఎంసీకి చూపించారు. కానీ ఇందులో కాలేజీ ఏర్పాటుకు కమిషన్ ఒప్పుకోలేదు. రూల్స్ ప్రకారం కాలేజీ భవనం లేనందున పర్మిషన్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్టు మంచిర్యాల కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఎన్‌ఎంసీ ఉత్తర్వులు పంపింది. అయితే అప్పీల్‌కు మరో అవకాశం ఇచ్చింది.
ఈ నేపథ్యంలో కాలేజీకి పర్మిషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి హెల్త్ సెక్రటరీ లెటర్ రాశారు. ఎన్‌ఎంసీ పేర్కొన్న లోపాలను సవరిస్తామని, ఇందుకోసం ప్రభుత్వం తరఫున గ్యారంటీ (అఫిడవిట్) ఇస్తామని పేర్కొన్నారు. కేంద్రం కూడా నిరాకరిస్తే ఈ ఏడాది కాలేజీకి పర్మిషన్ వచ్చే అవకాశం ఉండదు. లోపాలను సవరించి వచ్చే సంవత్సరం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మంచిర్యాల సహా 8 కాలేజీలకు పర్మిషన్ కోరుతూ ఎన్‌ఎంసీకి గతేడాది మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దరఖాస్తు చేశారు. మంచిర్యాల కాలేజీకి తప్ప మిగతా ఏడు కాలేజీలకు పర్మిషన్ వచ్చింది. ఇదే విషయమై డీఎంఈ రమేశ్‌రెడ్డిని సంప్రదించగా.. కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేశామని, పర్మిషన్ వస్తుందని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు.