- ఆర్నెళ్ల పాటు మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ బుక్ నుంచి రిమూవ్
- తప్పుడు మెడికల్ రిపోర్ట్ ఇవ్వడమే కారణం
జనగామ, వెలుగు : జనగామ జిల్లా హాస్పిటల్, ఎంసీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పగిడిపాటి సుగుణాకర్ రాజుపై నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ) వేటు వేసింది. ఓ అబార్షన్ కేసు విషయంలో తప్పుడు మెడికల్ రిపోర్ట్ ఇచ్చారనే కారణంతో యాక్షన్ తీసుకుంది. ఆర్నెళ్ల పాటు మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ బుక్ నుంచి తొలగించాలని తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌ను ఆదేశించింది. వివరాలిలా ఉన్నాయి.. పాండుగుల దామోదర్ అనే వ్యక్తి 2011లో చెన్నై ఓఎన్జీసీలో జియోఫిజిస్ట్గా పనిచేసేవారు. అప్పట్లో జనగామ డీఎస్పీగా పనిచేస్తున్న నాగరాజు కూతుర్ని పెండ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు వీరి కాపురం బాగానే ఉన్నా తర్వాత గొడవలు జరిగాయి. ప్రెగ్నెంట్‌గా ఉన్న తనను తన భర్త దామోదర్ కాలితో కడుపుపై తన్నడంతో అబార్షన్ అయినట్లు తన తండ్రి నాగరాజు సహాయంతో 2011లో వగరంల్ మహిళా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. దీనికి కాలితో కడుపులో తన్నడంతోనే అబార్షన్ అయినట్లు డాక్టర్ సుగుణాకర్ రాజు ఇచ్చిన మెడికల్ రిపోర్టు కాపీ జతపరిచారు. దీంతో దామోదర్‌పై వేధింపుల కేసు నమోదు కాగా ఉద్యోగం నుంచి సస్పెన్షన్ వేటు పడి జైలుకు వెళ్లారు.
ఈ క్రమంలో దామోదర్‌కు డీఎస్పీ కూతురుకు 2014లో కోర్టు ద్వారా విడాకులు మంజూరయ్యాయి. దీంతో దామోదర్ తన మానసిక క్షోభకు డాక్టర్ సుగుణాకర్ రాజు ఇచ్చిన తప్పుడు రిపోర్టు కారణమని ఆయన పై చర్యలు తీసుకోవాలని వైద్య విధాన పరిషత్ ఆఫీసర్లను విన్నవిస్తూ వచ్చాడు. మొదట్లో ఉమ్మడి ఏపీ కౌన్సిల్లో, 2015లో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో కంప్లైంట్ చేయగా వారు సుగుణాకర్ రాజుకు నోటీసులతోనే సరిపుచ్చారని దామోదర్ ఆరోపించారు. తర్వాత ఢిల్లీలోని నేషనల్ మెడికల్ కమిషన్‌కు 2017లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఎన్ఎంసీ ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపింది. రూల్స్‌కు విరుద్ధంగా అబార్షన్ విషయంలో డాక్టర్ సుగుణాకర్ రాజు మెడికల్ రిపోర్ట్ ఇచ్చారని నిర్ధారణకు వచ్చింది. వైద్య వృత్తిలో అనైతికంగా వ్యవహరించారని తేల్చింది. దీంతో గత నెల 29న డాక్టర్ సుగుణాకర్ రాజును తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ బుక్ నుంచి ఆర్నెళ్ల పాటు రిమూవ్ చేయాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎథిక్స్ , మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డు ద్వారా ఆదేశించింది. కాగా ఆర్నెళ్ల పాటు ఆయన ఎలాంటి ప్రాక్టీస్ చేయరాదని రూల్స్ చెప్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగం నుంచి కూడా వేటు పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో బాధితుడు దామోదర్ ‘వెలుగు’తో మాట్లాడుతూ.. తన పై డాక్టర్ సుగుణాకర్ రాజు తప్పుడు రిపోర్ట్ ఇచ్చినట్లుగా రుజువు అయ్యిందన్నారు. 12 ఏండ్ల పోరాటానికి ఫలితం దక్కిందన్నారు.
నేను ఏ తప్పూ చేయలేదు
నేను ఏ తప్పుడు రిపోర్ట్లు ఇవ్వలేదు. 2014లోనే దామోదర్ దంపతులు విడాకులు తీసుకున్నారు. ఇద్దరు మరో పెండ్లి చేసుకుని జీవనం సాగిస్తున్నారు. డాక్టర్ గా తాను చేసిన పనిపై నేషనల్ మెడికల్ కమిషన్‌కు దామోదర్ తప్పుడు సమాచారం ఇచ్చారు. కమిషన్ ఇచ్చిన ఆర్డర్స్ పై అప్పిలేట్‌కు వెళ్లేందుకు 60 రోజుల గడువుంది. అప్పిలేట్ కు వెళ్తా. నా పై కొందరు చేస్తున్న కుట్రల నుంచి బయటపడతా.
- డాక్టర్ సుగుణాకర్ రాజు, జిల్లా హాస్పిటల్ సూపరెంటెండెంట్, జనగామ