డెబ్బయి ఐదేళ్ల స్వాతంత్ర్య భారతదేశం అనేక రంగాల్లో అభివృధ్ధిని సాధించింది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మన దేశప్రగతి అంబరాన్ని తాకుతోంది. చాలా సంతోషం. కానీ, వాస్తవాభివృధ్ధికి ఇదొక్కటే కొలమానం కాదుగదా! నిజానికి దేశంలోని పౌరులందరికీ ఎలాంటి వివక్ష, పక్షపాతం లేకుండా సమాన హక్కులు, అవకాశాలు లభ్యం కావాలి. అప్పుడే దేశస్వాతంత్ర్యానికి, అభివృధ్ధికి ఒక అర్థం ఉంటుంది. దేశ జనాభాలో సుమారు 30 కోట్లవరకు ముస్లిం జనాభా ఉంది. వీరిలో 60 శాతం మంది నేటికీ దారిద్ర్య రేఖ దిగువన దుర్భరమైన జీవనం గడుపుతున్నారు. ముస్లిం సముదాయంలోని విద్యాలేమి దీనికి ప్రధాన కారణం.
విద్యలో వెనుకబాటు
ఈనాటికీ ముస్లిం జనాభాలో సుమారు 43 శాతం నిరక్షరాస్యత ఉంది. 2001లో ముస్లింలలో నిరక్షరాస్యతా శాతం 42.5 ఉంటే ఇప్పుడు 42.7 శాతం. అంటే ఇంతటి సుదీర్ఘ ప్రస్థానంలో కేవలం 0.2 శాతం మాత్రమే పెరుగుదల నమోదైందన్నమాట. ముస్లింలలో గ్రాడ్యుయేషన్, ఆపై చదువులు చదువుతున్నవారి సంఖ్య 6.96 శాతం మాత్రమే. వివిధ పథకాలు, కార్యక్రమాల కింద ముస్లింలలో అక్షరాస్యత సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని చెప్పుకుంటున్నప్పటికీ, ఇలాంటి దయనీయ స్థితికి కారణాలేమిటన్న ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానం లేదు. ఐదు నుంచి తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గల పిల్లల్లో కేవలం 50శాతం ముస్లిం పిల్లలు మాత్రమే పాఠశాలలకు వెళుతున్నారు. ఏదో ఒక రకంగా అష్టకష్టాలు పడి ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు దొరకడం అంత సులభమేంకాదు.
ప్రభుత్వ ఉద్యోగాల్లోనే కాదు, ప్రైవేట్ రంగంలో కూడా వారికి ఉద్యోగాలు లభించట్లేదు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ముస్లింలకు హక్కులు ఎలా లభిస్తాయి, వారి సంక్షేమం ఎలాసాధ్యం? ఉన్నత స్థాయి ఉద్యోగాల విషయానికొస్తే, ఐఏఎస్‌ల్లో 3.0 శాతం, ఐఎఫ్ఎస్ల్లో1.8శాతం, ఐపీఎస్‌ల్లో 4.0శాతం, రైల్వేస్‌లో 4.5శాతం, పోలీస్ శాఖలో 6.0 శాతం, ఆరోగ్యశాఖలో4శాతం, రవాణాశాఖలో 6.5 శాతం న్యాయ శాఖలో 7.8శాతం మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. మొత్తంగా చూసినప్పటికీ ఏరంగంలోనూ ముస్లిం మైనారిటీల పరిస్థితి సంతృప్తికరంగా లేదు. జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ నివేదికలోని 9వ అధ్యాయం కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
రాజకీయ ప్రాతినిధ్యం కరువు
రాజకీయ ప్రాతినిధ్యం విషయానికొస్తే, లోక్ సభ, రాజ్యసభల్లో మొత్తం సభ్యుల సంఖ్య 790. ఇందులో కేవలం 51 మంది మాత్రమే ముస్లిం సభ్యులు. 245 మంది రాజ్యసభ సభ్యులకు 24 మంది, 545 మంది లోక్ సభ సభ్యులకు కేవలం 27 మంది మాత్రమే ముస్లిం మైనారిటీలు ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దేశం మొత్తం మీద 4 వేలమంది పైచిలుకు శాసన సభ్యులుంటే, కనీసం 4 వందల మంది కూడా ముస్లిం శాసన సభ్యులు లేరు. సుమారు పదిహేను రాష్ట్రాల్లో ఒక్క శాసనసభలో కూడా ముస్లింలకు ప్రాతినిధ్యం లేదు. కాబట్టి జస్టిస్ సచార్ నివేదికను అమలు పర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- ఎండి. ఉస్మాన్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్