ఖదీర్ మృతిపై అవసరమైతే సీబీఐ ఎంక్వైరీ

ఖదీర్ మృతిపై అవసరమైతే సీబీఐ ఎంక్వైరీ

పోలీసులు కొట్టడం వల్లే చనిపోయాడు
కేసు డాక్యుమెంట్స్ అడిగితే ఎస్పీ ఇవ్వలేదు
బాధిత కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలి
జాతీయ మైనార్టీ కమిషన్ మెంబర్ సయ్యద్ షాహెజాది

మెదక్/మెదక్ టౌన్, వెలుగు : ఖదీర్ ఖాన్ మృతిపై అవసరమైతే  సీబీఐ ఎంక్వైరీ చేయిస్తామని జాతీయ మైనార్టీ కమిషన్ మెంబర్ సయ్యద్ షాహజాది తెలిపారు. సోమవారం ఆమె మెదక్ లో ఖదీర్ ఖాన్ కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి భార్య సిద్దేశ్వరితో మాట్లాడి సంఘటన పూర్వాపరాలు అడిగి తెలుసుకున్నారు.   అనంతరం ఆమె  మీడియాతో మాట్లాడారు. ఖదీర్ ఖాన్ కేసు డాక్యుమెంట్స్ తీసుకురమ్మని  జిల్లా ఎస్పీకి చెబితే ఇవ్వలేదన్నారు. రాజ్యాంగబద్ధమైన కమిషన్ అడిగితే  డాక్యుమెంట్స్​ఎందుకు చూపించరని ప్రశ్నించారు. కమిషన్ పట్ల మెదక్​ఎస్పీ నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ఖదీర్ ఖాన్​ను ఏ అధికారంతో కొట్టారు, అతను దొంగతనం చేసినట్లు  ప్రూఫ్ ఉందా అని ప్రశ్నించారు. పోలీసులు కొట్టడం వల్లే ఖదీర్ ఖాన్ చనిపోయాడన్నారు. ఇది పోలీసులు చేసిన హత్యగా భావించాల్సి వస్తుందన్నారు.

అతని పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎక్కడ ఉందన్నారు. తాము అడిగిన  డాక్యుమెంట్స్ ఇవ్వకపోతే ఎస్పీని ఢిల్లీకి పిలుస్తామని చెప్పారు. జాతీయ కమిషన్​కు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడం లేదని, కలెక్టర్, ఎస్పీలు మత వివక్ష చూపుతున్నారన్నారు. ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ, డీజీపీని కమిషన్ ముందుకు పిలుస్తామన్నారు. కలెక్టర్ డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తానని చెప్పి మళ్ళీ నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఖదీర్​ఖాన్ కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం, భార్యకు ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇవ్వాలన్నారు. ఖదీర్ ఖాన్ మృతికి కారణమైన అధికారులను సస్పెండ్ చేయాలన్నారు. ఖదీర్ ఖాన్ మృతిపై హోం మినిస్టర్ మహమూద్​అలీ స్పందించి న్యాయం చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముస్లింల పట్ల వివక్ష చూపుతోందని అభిప్రాయపడ్డారు. ఆమె వెంట జిల్లా కలెక్టర్​రాజర్షి షా, జిల్లా ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని, మెదక్​ డీఎస్పీ సైదులు, ఆర్డీవో సాయిరామ్, జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ అధికారి జెమల్లా నాయక్, పోలీస్​ ఇన్స్​పెక్టర్లు గోపీనాథ్, విజయ్ తదితరులు ఉన్నారు.