తొమ్మిదేండ్లుగా ప్రతిపక్షాలున్నా, ప్రతిపక్షరహితమైన పాలన వలె .. సారు పాలన సాగింది! పాలకుడి ఆకాంక్షల్లోనే ప్రజల ప్రయోజనం ఏమైనా మిగిలిందా అని.. వడ్ల గింజల పరిగె ఏరుకున్నట్లు ఏరుకోవాలి! ఉదాహరణకు కాళేశ్వరం. సారు చేసిన డిజైన్. సారు మెచ్చిన మెగా కాంట్రాక్టు కంపెనీ. 18 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుందన్నారు. ఇపుడది 59 వేల ఎకరాలకు మించి ఇవ్వదని ఈ ఏడాది ప్రభుత్వమే ప్రకటించింది. సారు పాలనా తీరు అలా ఉంటది!18 లక్షల ఎకరాలకు రాకపోయినా.. కనీసం 59 వేల ఎకరాలకైనా నీరు వచ్చుడే మహాభాగ్యమైంది. సారు అ భివృద్దికి అదొక ఉదాహరణ. ఇకపోతే, ప్రజలు తమ గోడు చెప్పుకుందామనుకుంటే పాలకుడి దర్శనాలు ఉండవు మరి! దర్శనాలు ఉంటే గింటే తనకు చప్పట్లు కొట్టించుకోవాలనిపించినప్పుడు మాత్రమే ప్రగతి భవన్తలుపులు తెరుచుకుంటాయి. ఆంధ్రా వ్యాపారులు, కాంట్రాక్టర్లు, సినీనటులకు మాత్రం దర్శనాల కొదవ ఉండదు! ఈ మధ్య బీఆర్ఎస్ లో చేరేందుకు మహారాష్ట్ర నుంచి వస్తున్నవారికైతే రోజూ సర్వదర్శనాలే! సారు అనుమతి లేకుండా.. తెలంగాణ పౌరుడెవరైనా ప్రగతి భవన్ ముందు తారసపడ్డాడంటే.. అతని చేతిలో ఏ పెట్రోలు డబ్బానో, పురుగుల మందు డబ్బానో కనిపిస్తుంది.ఒకటా రెండా కడుపు రగిలిపోయే సంఘటనలు చెప్పడానికి? పోనీ.. ప్రజల గోడు విని, ముందుండి నడిపించే ప్రతిపక్షాలైనా ఉన్నాయా? అంటే రెండు జాతీయ పార్టీలు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్నా, వాటిని చూసుక మురువనా? కడుక్క తాగనా? అన్నట్లుంది వ్యవహారం.
ఆత్మ పరిశీలన అవరసరం
‘ఎన్నికలకు ఇంకా చాలా టైమ్ ఉంది, కేసీఆర్ అవినీతి పాలనపై ఇప్పుడే దర్యాప్తు చేస్తే ప్రజలు మర్చిపోతార’ని అప్పట్లో బీజేపీ నేతలు అంటుండేవారు. ఇపుడేమంటున్నారు? ‘ఎన్నికలు దగ్గరకొచ్చాయి, ఇపుడు దర్యాప్తులు మొదలు పెడితే కేసీఆర్ ప్రజల్లో సానుభూతి కోసం ప్రయత్నిస్తారనేలా అక్కడక్కడ మాట్లాడుతున్నారు. ‘తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతీ’ అనే బీజేపీ రాజకీయం తెలంగాణలో ఆ పార్టీని గెలిపించగలదని ఏ రాజకీయ పండితుడూ చెప్పడు! పోనీ, కేసీఆర్ పరిపాలనా అవినీతిపై కోర్టుల ద్వారానైనా దర్యాప్తులకు బీజేపీ ప్రయత్నిస్తున్నదా? అంటే ఆ జాడే కనిపించదు! జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు రోజూ కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై మాట్లాడి ప్రజలను ఆకర్షించారు. ప్రజలూ నమ్మారు. కేసీఆర్ ది భ్రష్టాచార్ పాలన అంటూ, పరివార్ వాద్ పాలన అంటూ ప్రధాని మోడీ నుంచి నడ్డా వరకు అంతా చెప్పుకొచ్చారు. ‘భ్రష్టాచారోంకో సజా మిల్నా చాహియే, నహీ మిల్నా చాహియే’ అని స్వయాన మోడీ పరేడ్ గ్రౌండ్ సభలో ప్రత్యక్షంగా తెలంగాణ ప్రజలనే అడిగారు. ఈడీ విచారణకు కవిత రెండు సార్లు ఢిల్లీకి వెళ్లినపుడు, ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. అరెస్టు జరగొచ్చని అనుకున్నారు. అది చాలదా.. కుటుంబ అవినీతిని తెలంగాణ ప్రజలు సహించలేకపోతున్నారని చెప్పడానికి! లిక్కర్ కేసులో కవితకు క్లీన్‌చీట్ దొరికిందా అనే అనుమానాలు పెరిగాయి. బీజేపీ, -బీఆర్ఎస్ ఒక్కటే అనే కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఉండనే ఉంది! ఏంచేస్తే ప్రజల్లో తమ పట్ల తిరిగి విశ్వాసం పెరుగుతుందో బీజేపీ ఆలోచించుకోవాల్సిందే!
కాంగ్రెస్ పార్టీది మరో కథ..
మరోప్రధాన ప్రతిపక్షపార్టీ కాంగ్రెస్ గురించి చెప్పుకోవాల్సింది చాలానే ఉంది. రెండు దఫాలు ఆ పార్టీ బీఆర్ఎస్ ఆకర్ష్ తో ఫిరాయింపులకు గురైంది. ప్రజల్లో ఆ పార్టీ పట్ల విశ్వసనీయత దెబ్బతిన్నది. సీనియర్స్ రాజకీయం కేసీఆర్ ముందు పరోక్షంగా లొంగి పోయిందనేందుకు 25 మంది ఎమ్మెల్యేలు, దాదాపు అంతే సంఖ్యలో ఎమ్మెల్సీలు కూడా పార్టీ వీడి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడమే సాక్ష్యం. ఆ పార్టీ ఆదరణ కొంతమేర ప్రజల్లో ఉన్నా, అసెంబ్లీలో నిలబడలేకపోయింది. రేవంత్ రెడ్డి అధ్యక్షుడయ్యాక కాస్త ఊపు వచ్చినా.. సీనియర్స్ గొడవలతో మరోసారి చతికిలబడింది. మూడు ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోవడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ ఇవ్వలేకపోవడం.. రేవంత్ రెడ్డితోనూ కాంగ్రెస్ ఎదగలేకపోతున్నదనే వాదనలు వినబడ్డాయి. ఇంతలో కవిత ఎపిసోడ్ బీజేపీపై అనుమానాలు పెంచడం, పాలకుడి అవినీతిపై బీజేపీ చేతలు లేకపోవడం, పొలిటికల్ సర్కిల్స్ లో బీజేపీ వ్యవహారంపై విశ్వాసం సన్నగిల్లుతూ రావడం, ఇంతలోనే కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ స్పెక్యులేషన్ పెరగడానికి అవకాశం కల్పించింది. అదేదో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే డైలాగ్‌తోనే గెలవొచ్చని కాంగ్రెస్ పార్టీ భావిస్తే పొరపాటే. ఎందుకంటే, కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ కు కనుసైగ చేస్తున్న ఉదంతాలు ఉన్నాయి. కాంగ్రెస్ జాతీయ స్థాయి నాయకులెవరూ ఈ మధ్య కేసీఆర్ పాలనపై మాట్లాడడం లేదు. పై మాట్లాడవద్దని ఢిల్లీ నిర్దేశం ఉన్నట్లుంది! కేసీఆర్ పాలనాతీరుపై విమర్శల బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు మాత్రమే వదిలేసినట్లున్నారు! సోనియాగాంధీ సైతం ఏరోజూ తెలంగాణకు వచ్చి, కేసీఆర్ ప్రభుత్వ తీరుపై విమర్శ చేసిన దాఖలాలు లేవు. కేంద్రంలో కాలం కలిసొస్తే కేసీఆర్ కాంగ్రెస్ కూటమికి మద్దతు ఇవ్వవచ్చు అనేదే, ఆయన పట్ల కాంగ్రెస్ జాతీయ నేతల సాత్విక రాజకీయం అనుకోవచ్చు.
ఫెయిర్ పాలిటిక్స్ కావాలి
మొత్తం మీద రెండు జాతీయపార్టీల బలహీనతలను కేసీఆర్ సొమ్ము చేసుకుంటూ రాజకీయంగా బతుకుతున్నారు. పదేళ్లలో అన్ని వ్యవస్థలను చెరబట్టి కూర్చున్న ఆయన.. ఓడినా నిద్రపోతారా? దేశంలోని అనేక పార్టీలకు ఫండింగ్చేశాడనే/చేస్తాడనే పేరున్న కేసీఆర్అత్యంత సంపన్న నేత అని ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో కేసీఆర్ కు కోవర్టులున్నారని లోకం కోడై కూస్తున్నది. అందుకే గెలిచేది ఎవరనేది కాదు. కేసీఆర్ రాజకీయమే తెలంగాణకు ఒక అనర్థం! ఆ అనర్థాన్ని అంతమొందించడంలో రెండు జాతీయపార్టీల ఆసక్తి ఎంత? తమ ఢిల్లీ రాజకీయాల కోసం తెలంగాణను ఫణంగా పెడితే అదొక అమానుషం! అందుకే బలమైన రాజకీయ నాయకులు ఇటు బీజేపీలోకే కాదు, కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా వెనుకముందవుతున్నారు. కేసీఆర్ ను గద్దెదించడమే లక్ష్యంగా చాలా మంది బీజేపీ, కాంగ్రెస్ లో చేరారు, చేరాలని చూస్తున్నవారూ ఉన్నారు. కానీ ఆ రెండు పార్టీలూ పరోక్షంగా కేసీఆర్ కు బ్యాక్‌డోర్ టచ్‌లో ఉంటే.. చేరిన, చేరాలనుకునే వారి పరిస్థితి ఏమిటి? ఇలాంటి పరిస్థితులే తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీపై చర్చకు తావిస్తున్నాయి. కాబట్టి, రెండు జాతీయపార్టీలు కూడా తెలంగాణలో ఫెయిర్ పాలిటిక్స్ నడిపితే మరో ప్రాంతీయ పార్టీ అవసరం రాదు. తెలంగాణలో బీజేపీ బలపడాలన్నా, కాంగ్రెస్ నిలబడాలన్నా, తెలంగాణను కాపాడాలన్నా దాగుడుమూతల రాజకీయానికి ఆ రెండు పార్టీలు తెరదించాలి.
రెండు పార్టీల తీరుతో తెలంగాణకు నష్టం
బీఆర్ఎస్ పట్ల రెండు జాతీయ పార్టీలదీ బలహీనతే కావచ్చు. కానీ వాటి ద్వంద్వ ప్రమాణాల వల్ల అంతిమంగా నష్టపోతున్నది, నష్టపోయేది తెలంగాణే. ప్రస్తుత పొలిటికల్ స్పెక్యులేషన్ చూసి కాంగ్రెస్ మురిసినా అది తొందరపాటే. ఎందుకంటే, రాష్ట్రంలో కేసీఆర్ రాజకీయం ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీని బతకనిచ్చే అవకాశాలు అనుమానమే. రెండు దఫాలు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీనే మింగేసిన కేసీఆర్.. రేపు మరోసారి మింగేయడనే గ్యారంటీ ఉన్నదా? అందుకే ఆ మధ్య రేవంత్‌రెడ్డి ఒక వాస్తవాన్ని ప్రజలకు విడమర్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్లను ఫిరాయించకుండా ఆపడం సాధ్యం కాదని, కాబట్టి కనీసం70 స్థానాలు గెలిపిస్తేనే కాంగ్రెస్ బతికుంటదని చెప్పుకొచ్చారు.
బీజేపీ చేతలు ఏవి?
దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీలో గెలవగానే.. ఇక బీజేపీయే బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమని చాటుకోవడం వరకు బాగానే ఉంది. కేసీఆర్ పాలనా అవినీతిపై ఆరోపణలూ బాగున్నాయి. కాళేశ్వరం ఏటీఎంగా మారిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడిపోవడం.. తెలంగాణ ప్రజలకు వినడానికి ఒక వింతగా మారింది. మొన్న కర్నాటకలో ఓటమి, తెలంగాణలోనూ ‘చేతలు’ లేకపోవడంతో బీజేపీ గ్రాఫ్ బాగా పడిపోతున్నదని, కాంగ్రెస్ పుంజుకుంటున్నదనే పొలిటికల్ స్పెక్యులేషన్ కామెంట్స్ బాగా పెరిగిపోతున్నాయి. కేంద్రంలో అధికారంలో లేకుంటే, బీజేపీ నుంచి ప్రజలు చేతలు ఆశించేవారు కారు. కేసీఆర్ భ్రష్టాచార్ పాలనను బీజేపీయే బయటపెట్టగలదనే నమ్మకమే తెలంగాణలో మొన్నటిదాకా ఆ పార్టీ గ్రాఫ్ పెరగడానికి ప్రధాన కారణమైంది. బలమైన నాయకులు సైతం బీజేపీలో చేరింది అందుకే. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి ఫిరాయించడంతో కాంగ్రెస్ పట్ల ప్రజల విశ్వాసం సన్నగిల్లడం కూడా బీజేపీ గ్రాఫ్ పెరగడానికి అవకాశమిచ్చింది. ప్రత్యామ్నాయం బీజేపీయే అని పొలిటికల్ సర్కిల్స్ భావించాయి. కానీ ఇవాళ తిరిగి ఆ గ్రాఫ్ పడిపోతున్నదనే స్పెక్యులేషన్స్ఎందుకు వస్తున్నాయి? ఇది ఆ పార్టీకి ప్రస్తుతం ఎదురవుతున్న ప్రశ్న.
- కల్లూరి శ్రీనివాస్ రెడ్డి, పొలిటికల్ ఎనలిస్ట్